TG : త్వరలో కొత్త రేషన్ కార్డులు ఇస్తాం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

తెల్ల రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఇక నుంచి ఆరోగ్య శ్రీ అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం కరీంనగర్‌లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. అర్హులైన వారందరికీ ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తామని, ఆరోగ్యశ్రీ కార్డు, రేషన్ కార్డు వేర్వేరుగా ఇస్తామని అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జ్ మంత్రిగా తాను ఆలస్యంగా వచ్చానని, ప్రతి నెల సమీక్షలు నిర్వహిస్తానని చెప్పారు. గత పదేళ్లుగా ఇరిగేషన్ ప్రాజెక్టులు నీళ్ల కోసం కాకుండా డబ్బుల కోసం కట్టారని ఆరోపించారు. కాళేశ్వరం విషయంలో అన్నీ తప్పుడు లెక్కలేనని, రూ.93 వేల కోట్లు ఖర్చు చేసి లక్ష ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదని దుయ్యబట్టారు. పాలమూరు రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టుల్లో కూడా అవినీతి జరిగిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అత్యంత ఘోరమైన తప్పిదమని, ఈ ప్రాజెక్టు తప్పిదమని కేంద్ర జలవనరుల సలహాదారు కూడా పీసీ ఘోష్ కమిషన్ ముందు ఆధారాలతో వివరించారన్నారు. ప్రజలపై ఇంత భారం మోపారు కాబట్టే బీఆర్‌ను ఇంటికి పంపామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com