NIA : స్లీపర్ సెల్స్ కదలికలపై ఎన్ఐఏ ఆరా

జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదుల దుశ్చర్య నేపథ్యంలో రాష్ట్ర పోలీసులకు కేంద్ర నిఘా వర్గాలు ముందస్తు హెచ్చరికలు చేశాయి. ఉగ్రమూలాలపై నిఘా సారించాలని ఆదేశించడంతో ఎన్ఐఏ, స్థానిక పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇందులో భాగంగా హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్ తదితర ప్రాంతాలలో గతంలో ఐఎస్ఐఎస్, ఉగ్రభావ జాలంపట్ల ఆకర్షితులైన వారి కదలికలపై ఆరా తీస్తున్నారు. ఐసిస్ సిద్ధాంతాన్ని హైదరాబాద్ నగరంలో విస్తరించేందుకు గతంలో కీలక పాత్ర పోషించిన మాడ్యుల్స్, స్లీపర్ సెల్ ప్రస్తుతం ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారన్న వివరాలను సేకరిస్తున్నారు. సామాజిక మాధ్యమాలపైనా నిఘా సారిస్తున్నారు. నగరంలోని స్లీపర్ సెల్, మాడ్యుల్స్ కదలికలపై అటు ఎస్ఐఏ, ఇటు స్థానిక పోలీసులు రహస్య విచారణ చేపడుతున్నారు.
పాతబస్తీలో కొందరు యువకులు దీర్ఘకాలంగా కనిపించకుండా పోయారని, వారి అదృశ్యంపై పోలీసు స్టేషన్లలో ఎలాంటి కేసులు నమోదవలేదని ఎన్ఎస్ఐఏ విచారణలో తేలినట్లు సమాచారం. ఈక్రమంలో అజ్ఞాతంలో ఉన్నవారి పేర్లను స్థానిక పోలీసుల సహకారంతో ఎస్ఐఏ వర్గాలు సేకరిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా పాపులర్ ఫ్రంటు నిషేధించినా ఆ సంస్థ కార్య కలాపాలు నిర్వహిస్తున్నట్లు ఎన్ఎస్ఐఏ వర్గాలు అనుమానిస్తున్నాయి. ముఖ్యంగా దుబాయ్, జిద్దాలతో పాటు కొన్ని అరబ్ దేశాలలో పనిచేస్తున్న ఓ సామాజిక వర్గానికి చెందిన వారు ఉగ్రవాదాన్ని బలోపేతం చేయాలన్న సంకల్పంతో కుట్ర పన్నుతున్నారని ఎన్ఐఏ భావిస్తోంది. ఈక్రమంలో తెలంగాణలోనూ స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నట్లు తెలియవచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com