TPCC: టీపీసీసీ చీఫ్‌పై వీడని ఉత్కంఠ

TPCC: టీపీసీసీ చీఫ్‌పై వీడని ఉత్కంఠ
X
తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడి నియామకంపై తర్జనభర్జన... మరో రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం

టీపీసీసీ నూతన అధ్యక్షుడి నియామకం, రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై కసరత్తును కొలిక్కి తెచ్చేందుకు కాంగ్రెస్‌ అధిష్ఠానం ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. పార్టీ నాయకుల మధ్య ఏకాభిప్రాయం తేవడానికి, ఎవరైతే పార్టీని తెలంగాణలో ఉరకలెత్తించగలరనే విషయంపై తర్జనభర్జనలు చేస్తున్నారు. గతంలో రేవంత్రెడ్డి బీఆర్ఎస్పై ఢీ అంటే ఢీ అన్నట్లుగా వ్యవహరించి పార్టీని అధికారంలోకి తెచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కూడా అటువంటి డేరింగ్ పోలిటిషియన్ను టీపీసీసీగా నియమించాలని అధిష్టానం చూస్తోంది. అందువల్లే పీసీసీపై ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర నాయకత్వం శుక్రవారం ఢిల్లీలో పార్టీ పెద్దలతో సమాలోచనలు జరిపింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీలతో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సుమారు గంటకుపైగా సమావేశమై చర్చించారు.

పార్టీ పెద్దలు నలుగురూ.. రాష్ట్ర నాయకులు ముగ్గురితో విడివిడిగా కూడా మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నట్లు సమాచారం. విస్తృత చర్చలు జరిగినా తుది నిర్ణయానికి రాలేదని తెలిసింది. పీసీసీ అధ్యక్షుడిగా క్రియాశీలకంగా ఉండే వ్యక్తిని నియమించాలన్న అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. అనంతరం రాత్రి మరోసారి కేసీ వేణుగోపాల్, ఖర్గేలతో ఈ ముగ్గురు నాయకులు వేర్వేరుగా భేటీ అయ్యారు. పీసీసీ అధ్యక్ష పదవి నిర్ణయాన్ని బట్టి.. మంత్రివర్గ విస్తరణలో సామాజిక కూర్పు ఆధారపడి ఉంటుందని సమాచారం. రెండు మూడు రోజుల్లో పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, వెంటనే మంత్రి పదవులకు పేర్లు ఖరారు కావొచ్చని తెలుస్తోంది.

ఆ సామాజిక వర్గాలకే ప్రాధాన్యం

పీసీసీ అధ్యక్ష పదవికి బీసీ సామాజికవర్గం నుంచి ప్రస్తుత వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌గౌడ్, మాజీ ఎంపీ మధుయాస్కీ గౌడ్, ఎస్సీ సామాజికవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్, ఎస్టీల నుంచి ఎంపీ పోరిక బలరాం నాయక్‌ల పేర్లను రాష్ట్ర నాయకులు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. వీరిలో మహేశ్‌గౌడ్, లక్ష్మణ్‌కుమార్, బలరాం నాయక్‌లలో ఒకరికి మెరుగైన అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే మంత్రి వర్గ విస్తరణలో ఎస్సీ, బీసీ వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వొచ్చని తెలుస్తోంది.

Tags

Next Story