Amrapali : జూబ్లీహిల్స్ కొండరాళ్ల పేలుళ్లపై అమ్రపాలికి నోటీసులు
హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రాంతంలో కొండ రాళ్ల తొలగింపునకు పేలుళ్లు జరపడంపై దాఖలైన ప్రజాప్రయోజన వాజ్యం స్వీకరించిన హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. పేలుళ్ళ ఘటనపై భూగర్భ గనులు, పర్యావరణ, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శులతో పాటు, హైదరాబాద్ కలెక్టర్, జీహెచ్ఎంజీ కమిషనర్లను ప్రతివాదులుగా చేర్చింది. ఇందులో భాగంగా పేలుళ్లపై వివరణ ఇవ్వాలని ధర్మాసనం జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలికి నోటీసులు జారీ చేసింది. ఆమెతో పాటు భూగర్భ గనులు, పర్యావరణ శాఖల ముఖ్యకార్యదర్శులకు కూడా నోటీసులు పంపింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.
జూబ్లీహిల్స్ ప్రాంతంలో కొండ రాళ్ల తొలగింపునకు పేలుళ్లపై వార్తా పత్రికల్లో ఇటీవల వరుస కథనాలు వెలువడ్డాయి. జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాలో రాత్రింబవళ్లు దాదాపు 10 పేలుళ్లు జరిపి బండరాళ్లను తరలిస్తున్నారని, ముఖ్యంగా రాత్రిపూట పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయని, దీనివల్ల సమీప ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వార్తా కథనాలు ప్రచురితమయ్యాయి. మీడియాలో వచ్చిన కథనం ఆధారంగా ప్రధాన న్యాయమూర్తికి జస్టిస్ భీమపాక నగేశ్ లేఖ రాశారు. రాత్రి వేళల్లో జరుపుతున్న భారీ పేలుళ్లతో న్యాయవిహార్, భరణి లేఔట్, రామానాయుడు స్టూడియో ప్రాంతాల్లో నివాసముండే వారికి నిద్ర ఉండటం లేదని లేఖలో పేర్కొన్నారు.
పేలుళ్ల తర్వాత బండరాళ్లని రాత్రి వేళల్లో భారీ వాహనాల్లో తరలిస్తున్నారని లేఖలో తెలిపారు.ఈ లేఖను ప్రజాప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించిన హైకోర్టు భూగర్భ గనులు, పర్యావరణ శాఖ, పురపాలక శాఖ ముఖ్య కార్య దర్శులు, కాలుష్య నియంత్రణ మండలి, జీహెచ్ఎంసీ కమిషనరు నోటీసు జారీ చేసింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com