Omicron: తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు..

Omicron (tv5news.in)
Omicron: ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఒమిక్రాన్ కేసుల దడ మొదలయ్యింది. తాజాగా బుధవారం ఒక్క రోజే 10 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ పది కేసులతో కలిపి రాష్ట్రంలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 16కు చేరింది. కొత్తగా వెలుగు చూసిన 10 కేసుల్లో తూర్పు గోదావరి జిల్లాలో 3.. అనంతపురం జిల్లాలో 2, కర్నూల్ జిల్లాలో 2, చిత్తూరు, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి.
బాధితులంతా.. ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు. వీరంతా కూడా విదేశాల నుంచి వచ్చినవాళ్లే కావడం విశేషం. ఒకే రోజు 10 కేసులు రావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. మరోవైపు ఏపీలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొత్తగా 162 కేసులు నమోదయ్యాయి.ప్రస్తుతం రాష్ట్రంలో 1049 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో వెల్లడించింది.
అటు తెలంగాణలోనూ ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా మరో ఏడు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 62కు చేరింది. ఇందులో 48 కేసులు ఒక్క హైదరాబాద్‌లోనివే. అందులోనూ ముగ్గురు హైదరాబాదీలు కాగా.. మిగిలిన 45 మంది బయటి నుంచి వచ్చినవారే. ఈ 45 కేసులు టోలీచౌకీ పారామౌంట్ కాలనీకి సంబంధించినవే ఉన్నాయి.
ఇక్కడ 25 మంది వైద్య సిబ్బంది విధుల్లో ఉన్నారు. ఇతర దేశాల నుంచి వైద్యం కోసం ఏజెంట్ల ద్వారా హైదరాబాద్‌కు బాధితులు వచ్చారు. ఐతే.. సోమాలియన్లకు వైద్యం చేసిన వైద్య సిబ్బందికి కూడా ఒమిక్రాన్ సోకింది. పాజిటివ్ కేసుల్లో ఎక్కువగా లక్షణాలు కన్పించడం లేదు. హైదరాబాద్‌లో పారామౌంట్ కాలనీ, జూబ్లీహిల్స్, విజయనగర్ కాలనీ, యూసుఫ్‌గూడలో ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి.
విదేశాల నుంచి వస్తున్నవారిపై నిఘా పెంచింది తెలంగాణ సర్కారు. విదేశాల నుంచి వస్తున్న వారు, వారి కాంటాక్ట్‌లతో ఎలాంటి సబంధం లేని వారు ఒమిక్రాన్ బాధితులుగా మారుతుండడం ఆశ్చర్య కలిగిస్తోంది. తెలంగాణలో బయటపడ్డ ఒమిక్రాన్ కేసుల్లో ఇలాంటివారి సంఖ్యే అధికంగా ఉందని వైద్యారోగ్యశాఖ తేల్చింది. కేవలం ఒక డోస్ తీసుకోవడం వల్ల ఉపయోగం లేదని, ప్రతి ఒక్కరూ రెండో డోస్ కూడా వేయించుకోవాలని కోరారు గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్.
న్యూ ఇయర్ వేళ అప్రమత్తంగా ఉండాలని, కోవిడ్19 నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని గవర్నర్ సూచించారు. ఒమిక్రాన్‌పై ఆందోళన వద్దని, తగిన జాగ్రత్తలతో అప్రమత్తంగా ఉందామని పిలుపునిచ్చారు మంత్రి హరీస్‌రావు. కోవిడ్ టీకా వేయించుకోవడంలో నిర్లక్ష్యం వద్దని సూచించారు. జనవరి 3వ తేదీ నుంచి 15-18 సంవత్సరాల మధ్య పిల్లలందరికీ కొవాగ్జిన్ టీకా వేయనున్నట్లు ప్రకటించారు.
టీకాల కొరత లేదని 30లక్షల డోసులు అందుబాటులో ఉన్నాయని హరీష్ రావు స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్‌మెంట్ నిరంతరం జరుగుతోందన్నారు DMHO వెంకట్. ఒమిక్రాన్ కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలపారాయన. మొత్తానికి.. తెలుగు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com