TG : 40 శాతం మందికే లోన్లు మాఫీ చేశారు.. ఖర్గే, రాహుల్కి కేటీఆర్ లేఖ
రాష్ట్రంలోని రైతులందరికీ రుణమాఫీ వర్తింప చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు రైతు రుణమాఫీపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి లేఖ రాశారు. రుణమాఫీ అందని లక్షలాది మంది రైతుల తరఫున లేఖ రాస్తున్నట్లు పేర్కొన్నారు. ‘‘ సీఎం చెబుతున్న లెక్కలకు, క్షేత్రస్థాయి వాస్తవాలకు మధ్య తేడా ఉంది. వరంగల్ రైతు డిక్లరేషన్‌లో రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ హామీ ఇచ్చారు. కానీ, రాష్ట్రంలో 40 శాతం మందికి మాత్రమే రుణమాఫీ చేశారు. రూ.40 వేల కోట్ల రుణమాఫీ అని కేవలం.. రూ.17 వేల కోట్లే చేశారు. రుణమాఫీ చేయకుండా రైతులను నట్టేట ముంచారు. వారి తరఫున బీఆర్ఎస్ పోరాడుతుంది’’ అని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు.
లక్ష రూపాయల రుణమాఫీ కన్నా.. రెండు లక్షల రుణమాఫీ లబ్దిదారుల సంఖ్య 14 లక్షలు తగ్గడం రైతు రుణమాఫీ ఏ మేరకు విఫలమైందో అద్దం పడుతున్నదని కేటీఆర్ పేర్కొన్నారు. ‘‘రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ లెక్క ప్రకారం రెండు లక్షల రుణమాఫీకి 49,500 కోట్లు అంచనా వేశారు. ముఖ్యమంత్రే స్వయంగా రుణమాఫీకి 40వేల కోట్ల వరకు అవుతుందని తొలుత చెప్పుకొచ్చారు. కడుపు కట్టుకుంటే.. ఇది పెద్ద విషయం కాదని ఇంటర్వ్యూల్లో గొప్పలు చెప్పారు. చివరికి రాష్ట్ర కేబినెట్ సమావేశం వరకు వచ్చే సరికి 31 వేలకు దీన్ని కుదించారు. కనీసం అంతమేరకైనా చేశారా అంటే అదీ లేదు. రాష్ట్ర బడ్జెట్ లో మరింత కోత పెట్టి 26 వేల కోట్లు మాత్రమే కేటాయించారు. తీరా మూడు విడతల రుణమాఫీ తతంగాన్ని రూ.17,933 కోట్లతో మమ అనిపించారు. 49,500 కోట్ల రూపాయల రెండు లక్షల రుణమాఫీ కాస్తా.. మూడు విడతల్లో దాదాపు మూడింతలు తగ్గి 17,933 చేరింది. 40 శాతం కూడా రుణమాఫీ చేయకుండా.. లక్షలాది మంది రైతులను నట్టేట ముంచి ప్రక్రియ పూర్తయిందని సీఎం రేవంత్ రెడ్డి చేతులెత్తేయడంతో.. యావత్ తెలంగాణ ఇవాళ రైతుల ఆందోళనలతో అట్టుడుకుతోంది”అని లేఖలో పేర్కొన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com