Munugodu: మునుగోడులో జోరుగా టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్..

Munugodu: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో నల్గొండ జిల్లా మునుగోడు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అసెంబ్లీ ఎన్నికలకు మునుగోడు బైపోల్‌ను సెమీ ఫైనల్‌గా భావిస్తున్నాయి అధికార, ప్రతిపక్ష పార్టీలు. మునుగోడు సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్, ఈసారి మునుగోడును కైవసం చేసుకోవాలని టీఆర్ఎస్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని గెలిపించి తెలంగాణలో మరింత బలం పెంచుకోవాలని బీజేపీ పోటాపోటీగా వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రధాన పార్టీలన్ని ఫోకస్ చేయడంతో తెలంగాణ రాజకీయాలన్ని ప్రస్తుతం మునుగోడు చుట్టే తిరుగుతున్నాయి.
గెలుపు కోసం ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్న పార్టీల నేతలు.. ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. దీంతో మునుగోడు రాజకీయాలు తెలంగాణలో కాక రేపుతున్నాయి. ఇక హుజురాబాద్ ఉప ఎన్నిక ఓటమితో షాకైన అధికార టీఆర్ఎస్ మునుగోడులో ఎలాగైనా గెలిచేందుకు ప్రణాళికలు రచిస్తోంది. మునుగోడు టార్గెట్‌గా టీఆర్ఎస్.. నియోజకవర్గంలో ఆపరేషన్ ఆకర్ష్‌ను మొదలుపెట్టింది. ఇప్పటికే మండలాల వారీగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీను ఇంచార్జ్‌లుగా నియమించింది. మంత్రి జగదీశ్ రెడ్డి డైరెక్షన్‌లోనే నియోజకవర్గంలో పర్యటిస్తున్న గులాబీ నేతలు.. ఈనెల 20న మునుగోడులో జరగనున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభ జనసమీకరణ ఏర్పాట్లూ చూస్తూనే వలసలపై ఫోకస్ పెట్టారు.
ఇతర పార్టీల స్థానిక ప్రతినిధులతో మాట్లాడుతూ గ్రామస్థాయిలో బలమున్న నేతలను తమ పార్టీలోకి లాగేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగా గత మూడ్రోజులుగా మంత్రి జగదీష్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్‌లో భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. సోమవారం ఇద్దరు ఎంపీటీసీలు, ఐదుగురు సర్పంచులను చేర్చుకున్న టీఆర్ఎస్.. మంగళవారం నారాయణపురం మండలం కొత్తగూడెం సర్పంచ్ సుశీల, చండూరు మున్సిపాలిటీ కో ఆప్షన్ మెంబర్ ఎండీ సయ్యద్ వహిద్, శేఖర్‌రెడ్డి, మునుగోడు ఇండిపెండెంట్ ఎంపీటీసీ బొడ్డు శ్రావణిలు గులాబీ కండువా కప్పుకున్నారు.
కేసీఆర్ మునుగోడు సభలోపు ఇతర పార్టీలకు చెందిన మరికొంత మంది నాయకులు టీఆర్ఎస్‌లో చేరుతారనే ప్రచారం సాగుతోంది. మరోవైపు.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈనెల 21న కేంద్రమంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరబోతున్నారు. తనతో పాటు వందలాది మంది అనుచరులను కమలం గూటికి తీసుకువెళ్లాలని రాజగోపాల్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్‌లో తనకు మద్దతుగా ఉన్న నేతలను బీజేపీలో చేర్చేలా రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే చర్చలు జరుపుతున్నారు.
దీంతో ముందే అప్రమత్తమైన టీఆర్ఎస్ నేతలు.. కాంగ్రెస్ నేతలెవరు రాజగోపాల్ రెడ్డితో వెళ్లకుండా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. అమిత్ షా సభలోపే మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ను ఖాళీ చేసే ప్రయత్నంలో టీఆర్ఎస్ నాయకులు ఉన్నారని ప్రచారం జరుగుతోంది. మరి.. ఈ ఆపరేషన్ ఆకర్ష్ మంత్రా.. మునుగోడులో గులాబీ పార్టీకి ఎంతవరకు విజయం తెచ్చిపెడుతుందో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com