TG : ప్రేమ పెళ్లికి ఒప్పుకోని తల్లిదండ్రులు.. యువతి ఆత్మహత్య

ప్రేమ వ్యవహారం ఓ యువతి ప్రాణాలను బలిగొంది. ఉన్నత చదువులు చదివి, ప్రభుత్వ ఉద్యోగం సాధించి తమ కుటుంబాన్ని పోషిస్తుందని ఆశపడ్డ తల్లిదండ్రుల కలను ప్రేమ అనే రెండు అక్షరాలు చెరిపివేసింది. ప్రేమించిన వ్యక్తితో పెళ్లికి కుటుంబ సభ్యులు నిరాకరించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్య చేసుకుంది. శివ్వంపేట మండలం తాళ్లపల్లి తండాకు చెందిన ధనావత్ స్వరూప, కేశ్య నాయక్ దంపతులకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. మూడో కూతురు సక్కుబాయి ఎంబీఏ పూర్తిచేసింది. గ్రూప్-2 పరీక్షలకు సిద్ధమవుతూనే, నార్సింగ్‌లోని ఓ ప్రైవేటు సంస్థలో పని చేసేది. ఈ క్రమంలో ఆమెకు సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ కానిస్టేబుల్‌తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. అతడిని పెళ్లి చేసుకుంటానని సక్కుబాయి ఇంట్లో చెప్పగా, అన్న వరస అవుతాడని కుటుంబ సభ్యులు సర్ది చెప్పారు. దీంతో సక్కుబాయి మనస్తాపానికి గురైంది. పది రోజుల క్రితం తండ్రికి ఫోన్ చేసి, హైదరాబాద్ వెళ్లి ఉద్యోగం చేస్తానని చెప్పగా, తండ్రి వద్దని చెప్పారు.
ఈ నేపథ్యంలోనే నవంబర్ 1న కుటుంబ సభ్యులు పొలం వద్దకు వెళ్లగా, సక్కుబాయి గడ్డి మందు తాగింది. ఆ తర్వాత తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పింది. వెంటనే తండ్రి వచ్చి, ఆమెను నర్సాపూర్‌లోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ సక్కుబాయి మృతి చెందింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com