జూబ్లీహిల్స్ ను చుట్టేస్తున్న పార్టీలు.. మూడు పార్టీల్లో టెన్షన్..

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఇప్పుడు తెలంగాణలో అత్యంత కీలకంగా మారింది. కాంగ్రెస్ పార్టీకి, బిఆర్ఎస్ పార్టీకి, బిజెపికి సమానంగా ఈ ఎన్నిక సవాల్ విసురుతోంది. ఇది ఏ ఒక్క పార్టీకి అత్యంత కీలకమని చెప్పలేం. అన్ని పార్టీలు ఇక్కడ పాగా వేసి తమ సత్తా చాటుకోవాలని చూస్తున్నాయి. ఇందులో భాగంగా మూడు పార్టీల నేతలు జూబ్లీహిల్స్ ను చుట్టేస్తున్నారు. స్లమ్ ఏరియాల నుంచి.. లగ్జరీ అపార్ట్మెంట్స్ దాకా అందర్నీ కలుస్తున్నారు. తాము చేయాలనుకున్న పనులను చెబుతూ.. ప్రత్యర్థి పార్టీలపై రకరకాల ప్రచారాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. జూబ్లీహిల్స్ లో బలమైన యాదవ సామాజిక వర్గం నుంచి వచ్చారు కాబట్టి.. అది ఆయనకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. అలాగే అధికార కాంగ్రెస్ పార్టీకి ఎంతైనా కొంత సానుకూలత ఉంటుందని ఆయన ఉద్దేశం. పైగా ఎంఐఎం మద్దతు ఉండటంతో ముస్లిం ఓట్లు తనకే గంపగుత్తగా పడతాయని ఆశిస్తున్నారు.
దీంతో పాటు ఇప్పటికే రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయారు కాబట్టి.. ఆ సానుభూతి కూడా కలిసొస్తుందని కాంగ్రెస్ పార్టీ అంచనా. అటు బి ఆర్ ఎస్ పరిస్థితి చూస్తే మాగంటి సునీత సెంటిమెంటును ఎక్కువగా నమ్ముకుంటున్నారు. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చనిపోవడం వల్ల వచ్చిన ఎన్నిక కాబట్టి.. ప్రజలు తనకి మద్దతు ఇస్తారని పైగా గోపీనాథ్ కు జూబ్లీహిల్స్ లో ఉన్న పట్టు తనకు ప్లస్ పాయింట్ గా భావిస్తున్నారు సునీత. కెసిఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి పనులు కూడా తనకు ఓట్లు తెస్తాయని ఆశిస్తున్నారు. అలాగే కేసిఆర్ హయంలో ఇచ్చిన సబ్సిడీ గొర్రెలు యాదవ కమ్యూనిటీని తమ వైపు చూసేలా చేస్తాయని బిఆర్ఎస్ నేతలు అంటున్నారు.
ఇటు బిజెపి విషయానికి వస్తే.. లంకల ప్రదీప్ రెడ్డి గతంలో పోటీ చేసి ఓడిపోయారు కాబట్టి ఆ సెంటిమెంట్ కొంత వర్కౌట్ అవుతుందని భావిస్తున్నారు. పైగా జూబ్లీహిల్స్ లో బిజెపి పార్టీకి మంచి పట్టు ఉంది కాబట్టి అవి ఓట్లు తెచ్చి పెడతాయి అంటున్నారు ప్రదీప్ రెడ్డి. అందులోనూ కిషన్ రెడ్డి సపోర్ట్ బలంగా ఉంది. ఆ విషయాలపై ఆయన ఫోకస్ పెడుతున్నారు. అయితే జూబ్లీహిల్స్ లో ఎవరికి ఎంత ఓట్లు వస్తాయనేది అప్పుడే చెప్పలేము. ఈసారి ఓఆర్ఆర్ బాధితులు, ఫార్మాసిటీ బాధితులు కూడా జూబ్లీహిల్స్ లో పోటీ చేస్తున్నారు. కాబట్టి ఎవరి ఓట్లు ఎటువైపు చీలిపోతాయి అనేది అంత ఈజీగా చెప్పలేము. మరి ఎవరికి జూబ్లీహిల్స్ కుర్చీ దక్కుతుందో చూడాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

