Minister Ponnam : పాస్‌పోర్ట్ సేవలు మరింత సులభతరం : మంత్రి పొన్నం

నగరవాసులకు పాస్‌పోర్ట్ సేవలను మరింత చేరువ చేసేందుకు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్) మెట్రో స్టేషన్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన పాస్ పోర్ట్ సేవ కేంద్రాన్ని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ లాంఛనంగా ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు.
కాగా అమీర్‌పేటలోని ఆదిత్య ట్రేడ్ సెంటర్‌లో కొనసాగిన పాస్‌పోర్ట్ సేవా కేంద్రాన్ని ఇప్పుడు ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్‌కు పూర్తిగా తరలించారు. అదేవిధంగా టోలీచౌకీలోని షేక్‌పేట్‌లో గల ఆనంద్ సిలికాన్ చిప్ భవనంలో పనిచేస్తున్న మరో పాస్‌పోర్ట్ కేంద్రాన్ని రాయదుర్గం పాత ముంబయి రోడ్డులోని సిరి బిల్డింగ్‌లోకి మార్చారు. ఈ రెండు కేంద్రాల పూర్తిస్థాయిలో పాస్‌పోర్ట్ సేవలను అందిస్తాయని అధికారులు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం తో పాటు...హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ మిర్జా రియాజ్ ఉల్ హసన్, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, పాస్‌పోర్ట్స్ జాయింట్ సెక్రటరీ కే.జే.శ్రీనివాసులు, హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందనతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. పాస్‌పోర్ట్‌ల జారీలో హైదరాబాద్ దేశంలోనే ఐదో స్థానంలో ఉందని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా మొత్తం ఐదు పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు ప్రజలకు సేవలు అందిస్తున్నాయని ఆయన వివరించారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

