Telangana High Court : తెలంగాణ హైకోర్టులో జడ్జిపై పిటిషనర్ దురుసు ప్రవర్తన

కోర్టు హాలులో న్యాయమూర్తి పట్ల ఒక పిటిషనర్ దురుసుగా ప్రవర్తించిన ఘటన తెలంగాణ హైకోర్టులో చోటుచేసుకుంది. రివ్యూ పిటిషన్‌లో తీర్పు వెలువరించట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ బెదిరింపు ధోరణికి పాల్పడ్డారు. ఈ సంఘటనపై న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, కేసు విచారణ నుంచి తాను వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. అంబర్‌పేటకు చెందిన బి.చెన్నకృష్ణారెడ్డి ఒక సివిల్ వివాదంపై హైకోర్టులో అప్పీలు దాఖలు చేసి స్టే పొందారు. 18 ఏళ్ల తర్వాత దీనిపై విచారించిన జస్టిస్ నగేశ్ భీమపాక అప్పీలును కొట్టివేశారు. దీనితో, చెన్నకృష్ణారెడ్డి రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ మధ్యకాలంలో చెన్నకృష్ణారెడ్డి అనుమతి లేకుండా నేరుగా న్యాయమూర్తి ఛాంబర్‌లోకి వెళ్లి "అప్పీల్‌ను ఎలా కొట్టివేస్తారు, రివ్యూ పిటిషన్‌లో ఎందుకు తీర్పు ఇవ్వరు" అని ప్రశ్నించారు. న్యాయమూర్తి ఛాంబర్‌లోకి పిటిషనర్ రాకూడదని, కేసు గురించి మాట్లాడకూడదని జస్టిస్ నగేశ్ భీమపాక ఎంత చెబుతున్నా, చెన్నకృష్ణారెడ్డి దురుసుగా వ్యవహరించారు. దీనితో న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేసి, కేసును ఓపెన్ కోర్టులో వింటానని చెన్నకృష్ణారెడ్డిని బయటకు పంపించి, గురువారం విచారణ చేపట్టారు.
బెదిరింపు ధోరణి:
కోర్టు విచారణ సమయంలో, తన కేసును తానే వాదించుకుంటున్న చెన్నకృష్ణారెడ్డి, రివ్యూ పిటిషన్‌లో ఎందుకు తీర్పు వెలువరించరంటూ న్యాయమూర్తినే ప్రశ్నించారు. తన రివ్యూ పిటిషన్‌లో వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని బెదిరింపు ధోరణికి పాల్పడ్డారు. పిటిషనర్ ప్రవర్తనతో తీవ్ర ఆగ్రహానికి గురైన జస్టిస్ నగేశ్ భీమపాక, చెన్నకృష్ణారెడ్డి వయసును దృష్టిలో ఉంచుకొని దీన్ని కోర్టు ధిక్కరణగా పరిగణించడం లేదని తెలిపారు. అయితే ఈ కేసు విచారణ నుంచి తాను వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఈ ఫైలును ప్రధాన న్యాయమూర్తి ముందుంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com