ప్రధాన పార్టీల ప్రచారంతో నాగార్జునసాగర్‌లో రాజకీయ వేడీ

నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లో ప్రధాన పార్టీలు హోరాహోరీ ప్రచారాలతో దూసుకెళ్తున్నాయి. సాగర్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ.. పరస్పరం ఆరోపణలు, విమర్శలతో ముందుకు సాగుతున్నాయి. ఇక టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ తరుపున మంత్రులు ప్రచారబరిలో దిగారు. నోముల భగత్‌తో కలిసి మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, జగదీష్‌రెడ్డి ప్రచారం చేశారు. ఇక రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, నోముల భగత్ సతీమణి భవానీతో పాటు స్థానిక టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు నియోజకవర్గంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. త్రిపురరాంలో ప్రధాన రహదారిపై కరపత్రాలు పంచిన మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్.. టీఆర్ఎస్‌కు సాగర్ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని స్పష్టంచేశారు.
మరోవైపు టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూనే ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు గుప్పించారు మంత్రి జగదీష్‌రెడ్డి. మూడున్నర దశాబ్దాల పాటు సాగర్ నియోజకవర్గం నుంచి జానారెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించినా అభివృద్ధి శూన్యమని ఆరోపించారు. నాగార్జునసాగర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి జగదీష్‌రెడ్డి ప్రజలను కోరగా.. ఈనెల 14న సీఎం కేసీఆర్ బహిరంగ సభతో టీఆర్ఎస్ విజయానికి తిరుగులేదని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ధీమా వ్యక్తం చేశారు.
ఇటు కాంగ్రెస్ పార్టీ సైతం టీఆర్ఎస్‌కు ధీటుగా సాగర్‌లో ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి తరుఫున పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్‌తో పాటు స్థానిక నేతలు, కార్యకర్తలు ముమ్మర ప్రచారం చేపట్టారు. అనుముల మండలంలోని పలు గ్రామాల్లో వందలాది మంది కార్యకర్తలతో జానారెడ్డి భారీ ర్యాలీ నిర్వహించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. నాగార్జునసాగర్ ప్రాంతాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసిన జానారెడ్డిని గెలిపించాలని జీవన్‌రెడ్డి ప్రజలను అభ్యర్థించారు.
ఇదిలా ఉంటే బీజేపీ సైతం సాగర్ ఉప ఎన్నిక ప్రచారాన్ని ముమ్మరం చేసింది. కమలం పార్టీ అభ్యర్థి రవికుమార్‌తో కలిసి బీజేపీ ఆగ్రనేతలు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తూ వినూత్నంగా ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే.. గత కాంగ్రెస్ పాలనపైనా బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. బీజేపీ గెలిస్తే కేంద్రం సాయంతో నాగార్జునసాగర్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తుందని కమలం నేతలు తెలిపారు. మొత్తానికి ఓవైపు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రచార సభ.. మరోవైపు గెలుపే లక్ష్యంగా సాగుతున్న ప్రధాన పార్టీల ప్రచారంతో నాగార్జునసాగర్‌లో రాజకీయం వేడెక్కింది. మరి.. బైపోల్ పోరులో సాగర్ ప్రజలు ఏపార్టీకి పట్టం కడతారో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com