Draupadi Murmu: భూదాన్ పోచంపల్లిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Draupadi Murmu: భూదాన్ పోచంపల్లిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
చేనేత వస్త్రాల తయారీ కార్మికులతో ముఖాముఖి

శీతాకాల విడిదిలో భాగంగా ఈ నెల 18న హైదరాబాద్‌కు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపదీముర్ము... ఇవాళ పోచంపల్లిలో పర్యటించనున్నారు. టై అండ్ డై ఇక్కత్ పట్టు చీరల తయారీని పరిశీలించి.... చేనేత కార్మికులతో సమావేశంకానున్నారు. 350 మంది ప్రత్యేక ఆహ్వానితులతో ముఖాముఖీలో రాష్ట్రపతి పాల్గొంటారు. ఈ పర్యటన నేపథ్యంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.

మగువలు మెచ్చే పట్టుచీరలకు నిలయం.. దేశంలోనే మొదటి సారిగా భూదానం జరిగిన పవిత్ర ప్రదేశం.. ఈ అంశాలే పోచంపల్లికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చాయి. ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా పనిచేస్తున్న ప్రపంచ పర్యాటక సంస్థ U.N.W.T.O నిర్వహించిన బెస్ట్‌ టూరిజం విలేజ్‌ పోటీల్లో ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపికైంది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న పోచంపల్లిని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నేడు సందర్శించనున్నారు. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో రానున్న రాష్ట్రపతికి అధికారులు ఘనస్వాగతం పలకనున్నారు. పట్టుచీరలకు నిలయమైన పోచంపల్లిలో... చేనేత వస్త్రకళానైపుణ్యాన్ని స్వయంగా ద్రౌపదీముర్ము తిలకించనున్నారు. గ్రామీణ పర్యాటక కేంద్రంలోని వినోభా మందిరాన్ని సందర్శించి... భూదానోద్యమ చరిత్రను తెలిపే ఫొటోగ్యాలరీని తిలకిస్తారు. భూదాన ఉద్యమకారుడు వినోభా బావే, భూదాత వెదిరె రాంచంద్రారెడ్డి విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పిస్తారు. చేనేత గృహాలను సందర్శించిన అనంతరం... రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తయారయ్యే అన్ని చేనేత వస్త్రాలతో బాలాజీ ఫంక్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను తిలకిస్తారు. సంత్‌కబీర్‌, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు, చేనేత కళాకారులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశానికి హాజరవుతారు.

రాష్ట్రపతి ద్రౌపదీముర్ము పర్యటన నేపథ్యంలో పకడ్బంధీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. రాచకొండ సీపీ సుధీర్‌బాబు జిల్లా కలెక్టర్‌తో కలిసి రాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, వాయుసేన, పారామిలిటరీ దళాలతో భద్రత కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే హెలిప్యాడ్ నుంచి కాన్వాయ్ ట్రయల్ నిర్వహించారు. బాలాజీ ఫంక్షన్ హాల్ తో పాటు హెలిప్యాడ్ పరిసర ప్రాంతాలను.. బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.


Tags

Read MoreRead Less
Next Story