Telangana : వైరస్ వ్యాప్తిని అడ్డుకోండి.. తెలంగాణ సర్కారు కీలక సూచనలు

చైనాలో మెటాన్యుమోవైరస్ (హెచ్ఎంపీవీ) శరవేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇందు కోసం ముందస్తు చర్యలు చేపట్టింది. కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా శరవేగంగా నిర్ణయాలను తీసుకుంది. ఈ మేరకు తెలం గాణ ప్రజారోగ్యం-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ డాక్టర్ బి.రవీందర్ నాయక్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ఒక్క హెచ్ఎంపీవీ కేసు ఇంకా నమోదు కాలేదని స్పష్టం చేశారు. దీని బారిన పడకుండా ఉండటానికి పలు సూచనలు చేశారు. హెచ్ఎంపీవీ మరో రెస్పిరేటరీ వైరస్ అని, చలికాలంలో జలుబు, ఫ్లూ తరహా లక్షణాలు కనిపిస్తాయని వివరించారు. ప్రత్యేకించి చిన్న పిల్లలు, వయోవృద్ధులు దీని బారినపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు కొన్ని సూచనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా చేయాల్సిన-చేయకూడని వివరాలను ఆయన వివరించారు.
ఇవి చేయండి: దగ్గు, తుమ్ముతున్నప్పుడు నోటికి లేదా ముక్కుకు హ్యాండ్ కర్చీఫ్ లేదా టిష్యూ పేపర్‌ను అడ్డుపెట్టుకోవాలి. సబ్బు లేదా ఆల్కహాల్‌తో కూడిన శానిటైజర్ తో తరచూ చేతులను శుభ్రపర్చుకోవాలి. గుంపుగా ఉండే ప్రదేశాలకు వెళ్లకూడదు. అలాంటి ప్రదేశాలకు వెళ్లాల్సి వస్తే జాగ్రత్తలు తీసుకోవాలి. ఫ్లూతో బాధపడుతున్నవారికి దూరంగా ఉండాలి. జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతు న్నప్పుడు బహిరంగ ప్రదేశాలకు వెళ్లకూడదు. గుంపులో తిరగకూడదు. చాలినంత మంచినీళ్లు తీసుకోవాలి. పౌష్టికాహారాన్ని స్వీకరించాలి. అనారోగ్యం బారినపడినప్పుడు ఇతరులను కలుసుకోవడాన్ని తగ్గించాలి. ఇంట్లోనే ఉండాలి. గాలి ధారాళంగా వచ్చేలా చేసుకోవాలి. కంటి నిండా నిద్రపోవాలి.
ఇవి చేయొద్దు: ఇతరులకు షేక్ హ్యాండ్స్ ఇవ్వకూడదు. ఒకసారి వినియోగించిన టిష్యూ పేపర్లు, హ్యాండ్ కర్చీఫ్‌ను మళ్లీ వాడకూడదు. అనారోగ్యంతో బాధపడుతున్నవారితో దూరంగా ఉండాలి. తరచూ కంటిని నలుపుకోవడం, ముక్కు, నోటిని చేత్తో తుడుచుకోవడాన్ని మానుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయకూడదు. డాక్టర్ ను సంప్రదించకుండా సొంతంగా ఎలాంటి మందులు వాడకూడదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com