High Court : పుష్ప-2 లాభాలతో కళాకారులకు పింఛన్.. హైకోర్టులో పిల్

బాక్సాఫీస్ ను షేక్ చేసిన పుష్ప-2 మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ సినిమాకు వచ్చిన లాభాలను జానపద కళాకారుల పింఛన్ కోసం కేటాయించాలంటూ తాజాగా తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. న్యాయవాది నరసింహా రావు దాఖలు చేసిన ఈ పిల్ పై సోమవారం విచారణ జరిగింది. బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపునకు అవకాశం ఇవ్వడంతో ఈ చిత్రానికి భారీగా లాభాలు వచ్చాయని పిటిషన్లో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చిత్ర లాభాలను కళాకారుల సంక్షేమానికి కేటాయించాలని, అందువల్ల పుష్ప-2 లాభాలు చిన్న చిత్రాల బడ్జెట్ రాయితీకి, జానపద కళాకారుల పింఛన్ కోసం కేటాయించేలా ఆదేశాలివ్వాలని పిటిషనర్ కోర్టును కోరారు. విచారణ సందర్భంగా ఇప్పటికే బెనిఫిట్ షోలు, టికెట్ల వసూలు ముగిసింది కదా అని సీజే ప్రశ్నించారు. ప్రభుత్వం కల్పించిన వెసులుబాటు వల్ల వచ్చిన లాభాలు గురించే పిటిషన్ దాఖలు చేశామని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. అయితే అందుకు తగిన విధంగా సుప్రీంకోర్టు తీర్పు కాపీని సమర్పించాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com