Telangana : రేపటి నుంచి మూడు రోజులపాటు వర్షాలు

Telangana : రేపటి నుంచి మూడు రోజులపాటు వర్షాలు
X

తీవ్రమైన ఉష్ణోగ్రతలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణశాఖ తీపికబురు చెప్పింది. ఈ నెల 21 నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సిరిసిల్ల భూపాల పల్లి, వరంగల్, జగిత్యాల, మహబూబాబాద్, హన్మకొండ, జనగామ సిద్దిపేట జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురవనున్నాయి. అదేవిధంగా.. రాష్ట్రంలో పలుచోట్ల ఈ నెల 21, 23న తేలికపాటి వర్షాలు కురవనుండగా 22న పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. 22, 23 తేదీల్లో తెలంగాణలోని మంచిర్యాలు, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, దిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, గద్వాల మొత్తం 17 జిల్లాల్లో ఈదురు గాలులుతో కూడిన తుఫానుకు అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది.

హైదరాబాద్లో మార్చి 22 నుంచి మూడు రోజుల పాటు వాతావరణం పూర్తిగా మారిపోతుందని తెలిపింది. తెలంగాణలోని మిగతా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వడగండ్ల వానలు కురుస్తాయని హెచ్చరించింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వానలు, తుఫాను సంభవించే అవకాశం కూడా ఉందని స్పష్టం చేసింది. మార్చి నెలలోనే ఎండలు దంచి కొడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పనులకు వెళ్ళేవారు, మధ్యాహ్నం పూట బయటకు రావాలంటే భయపడుతున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవు తుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండలకు తోడు వడగాలు వీస్తుండటంతో చెరువులు కుంటలు ఎండిపోతున్నాయి.

యాసంగి వరి పంటను కాపాడుకోవడం రైతులకు సవాల్ గా మారింది. కనీసం ఏప్రిల్ మొదటి వారం వరకు వరి పంటకు సాగునీరు అందించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఈ నెల 22 నుంచి వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ కబురుతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. అదే సమయంలో వడగళ్లు కురిసే అవకాశం ఉండడం, పెనుగాలలు వీస్తాయన్న హెచ్చరికలతో వరి నేలవాలుతుందని, మామిడి నేలరాలుతుందన్న ఆందోళన కూడా రైతుల్లో నెలకొంది. ప్రస్తుతం నెల రోజులుగా రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. సాధారణం కంటే అదనంగా 4నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం పది దాటితే బయటికి వెళ్లాలంటే జనం భయపడిపోతున్నారు.

Tags

Next Story