TG : ఇవాళ కూడా వర్షసూచన.. అల్పపీడనం ఎఫెక్ట్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా ఇవాళ పలు ప్రాంతాల్లో తేలిక పాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలంగాణ వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావం కారణంగా రాష్ట్రంలో ఈదురు గాలులు తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి వీస్తాయని తెలిపింది. శనివారం నుండి పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే 5 రోజులు రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉదయం వేళల్లో పొగమంచు కురుస్తుందని తెలిపింది. తెలంగాణలో పగటిపూట టెంపరేచర్లు భారీగా పడిపోయాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రమంతా ముసురుపట్టింది. మబ్బులు కమ్మేశాయి. బుధవారం మొదలైన ముసురు గురువారం కూడా కొనసాగింది. గురువారమంతా సూర్యుడి జాడే కనిపించలేదు. మిట్టమధ్యాహ్నం దాటినా చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. అదే సమయంలో రాత్రి టెంపరేచర్లు పగటి టెంపరేచర్లకు నాలుగైదు డిగ్రీలకన్నా తక్కువగానే నమోదయ్యాయి.
హైదరాబాద్ సిటీ సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసింది.. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, నల్గొండ, నాగర్‌కర్నూల్, వికారాబాద్, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, సిద్దిపేట, హనుమకొండ, భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్, జనగామ, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడ్డాయి. మిగతా జిల్లాలతో పోలిస్తే హైదరాబాద్ సిటీలో వర్షపాతం కొంచెం ఎక్కువగా రికార్డయింది. అత్యధికంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గాయత్రినగర్‌లో 2.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో అత్యధికంగా కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్‌లో 32.9 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత రికార్డయింది. అత్యల్పంగా జనగామ, ములుగు జిల్లాల్లో 23 డిగ్రీల మేర పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాటితో పాటు యాదాద్రి, నల్గొండ, హనుమకొండ, హైదరాబాద్, సిద్దిపేట, ములుగు, మహబూబాబాద్, మేడ్చల్, సూర్యాపేట, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో 24 నుంచి 25 డిగ్రీల మధ్యనే పగటి టెంపరేచర్లు రికార్డయ్యాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com