TG: అక్టోబర్ 2 నుంచి రేషన్ కార్డులు

రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అక్టోబర్ 2 నుంచి కొత్త కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రులు ప్రకటించారు. దీనికి సంబందించిన విధివిధానాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు జారీ చేస్తామని సీఎం తెలిపారు. ముందు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి వాటిని స్క్రూట్నీ చేస్తారు. దీనికి సంబంధించిన విధి విధానాలను త్వరలోనే ఖరారు చేయనున్నారు. గురువారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎం కొత్త రేషన్ కార్డుల కోసం అప్లికేషన్ ప్రాసెస్ ను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజాపాలన దరఖాస్తుల్లో ఎక్కువగా ఆరు గ్యారెంటీల కంటే కూడా రేషన్ కార్డులకు ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి. ఆరు గ్యారెంటీలకు రేషన్ కార్డులనే ప్రామాణికంగా తీసుకోవడం.. తాజాగా రైతు రుణమాఫీకి ఆధారం రేషన్ కార్డునే తీసుకోవడంతో.. రేషన్ కార్డుల కోసం కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు.
పటిష్ట కార్యాచరణ
రేషన్ కార్డుల జారీకి పటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కొత్త రేషన్ కార్డుల కోసం అక్టోబరు 2 వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించాలని సీఎం సూచించారు. రేషన్ కార్డుల జారీకి సంబంధించిన విధి విధానాలపై ముఖ్యమంత్రి సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కొత్తగా రేషన్ కార్డులకు అర్హులు ఎంత మంది ఉంటారనే అంశంపై కూడా చర్చించారు.ఈ సందర్భంగా రేషన్ కార్డుల జారీకి సంబంధించి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి , దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, అధికారులకు పలు సూచనలు చేశారు. అర్హులందరికీ డిజిటల్ రేషన్ కార్డులు ఇవ్వడానికి సంబంధించి కసరత్తు చేశారు. ఈ అంశంపై త్వరలోనే మరోసారి సమీక్ష నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఇక కొత్త రేషన్ కార్డు దరఖాస్తులతో పాటు కొత్తగా రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లను చేర్చేందుకు కూడా తగిన విధంగా ప్రణాళికను సిద్దం చేస్తున్నారు.
నేడే తెలంగాణ కేబినేట్ భేటీ
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో వ్యవసాయ రుణమాఫీని సంపూర్ణంగా అమలు చేయడం, పంటల బీమా, రైతు భరోసా, హైడ్రాకు చట్టబద్ధత కల్పించే ఆర్డినెన్స్ జారీకి ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వివిధ అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com