TG Weather: తెలంగాణ జలాశయాలకు పోటెత్తుతున్న వరదనీరు, గేట్లు ఎత్తివేత..

TG Weather: తెలంగాణ జలాశయాలకు పోటెత్తుతున్న వరదనీరు, గేట్లు ఎత్తివేత..
X

గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో తెలంగాణలోని ప్రధాన జలాశయాలకు వరదనీరు పోటెత్తుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రవాహంతో ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. పలు చోట్ల పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోవడంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

రాష్ట్రంలో ప్రధాన ప్రాజెక్ట్ అయిన నాగార్జునసాగర్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు 14 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 598.40 అడుగులు కాగా, ప్రస్తుతం 588.40 అడుగుల వద్ద నీటి ప్రవాహం కొనసాగుతోంది. ఇక సాగర్ గేట్లు ఎత్తడంతో పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.

అదే విధంగా నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కూడా వరద ప్రవాహం పెరిగింది. ప్రాజెక్టులోకి 52,840 క్యూసెక్కుల నీరు వస్తుండగా, అధికారులు 8 గేట్లను ఎత్తి 53,685 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా వరద ప్రవాహంతో నిండిపోయింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 20.17 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటి నిల్వ కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 27,841 క్యూసెక్కులు ఉండటంతో అధికారులు 5 గేట్లను ఎత్తి అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. భారీగా నీటి విడుదల చేయడంతో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Tags

Next Story