TG : కాళేశ్వరం అవినీతిపై నివేదిక రెడీ.. ప్రభుత్వానికి సమర్పించనున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్

TG : కాళేశ్వరం అవినీతిపై నివేదిక రెడీ.. ప్రభుత్వానికి సమర్పించనున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్
X

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సుప్రీమ్ కోర్టు మాజీ జడ్జి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్‌ను 2024 లో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అప్పటి నుండి విచారణ చేపట్టిన పీసీ ఘోష్ కమిషన్ పలువురు అధికారులతో పాటు, రాజకీయ నాయకులు కూడా విచారించింది. ఈ క్రమంలో విచారణ పూర్తి చేసిన కమిషన్ మరో 2 రోజుల్లో తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది.

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లోని లోపాలు, వాటికి బాధ్యుల పై విచారణ జరపాల్సిందిగా ప్రభుత్వం పీసీ ఘోష్ కమిషన్ ను ఆదేశించింది. దీంతో ఈ ప్రాజెక్టులో భాగం అయిన పలువురు ఇంజనీర్ల తో పాటు, ఈఎన్సీ, ఐఏఎస్ అధికారులను విచారించింది కమిషన్. మొత్తం 116 మందికి పైగానే విచారించిన కమీషన్ అధికారులు..300 కు పై పేజీలతో నివేదికను సిద్ధం చేశారు. గత ప్రభుత్వం జారీ చేసిన జీవోలు, ఒప్పందాలు, నిధుల విడుదలను పరిశీలించి ఈ నివేదికను సిద్ధం చేశారు.

కాగా ఈ నెలాఖరుతో కమిషన్ గడువు ముగియనుండటంతో ఈ రెండు రోజుల్లోనే నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్ కు చేరుకున్న జస్టిస్ పీసీ ఘోష్ నివేదికకు తుది మెరుగులు దిద్దే పనిలో పడ్డారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సమయం ఇవ్వగానే రిపోర్టు సమర్పించనున్నారు.

ఇక ఈ నివేదిక ప్రభుత్వానికి చేరిన తరువాత కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తారు. మంత్రివర్గ ఉప సంఘం దానిని అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. అనంతనం దానిని కేబినెట్లో చర్చించి అసెంబ్లీ ముందు ఉంచుతారు. అసెంబ్లీలోనూ చర్చించిన అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశముంది. ఇప్పటికే ఎన్డీఎస్ఏ నివేదిక, విజిలెన్స్ నివేదికలతో ఇంజినీర్లకు పదోన్నతులు నిలిచిపోయాయి. మరి రోజుల్లో జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా ఎవరిపై చర్యలుంటాయన్నది ఆసక్తికరంగా మారింది.

Tags

Next Story