Revanth Reddy : ఢిల్లీకి చేరిన రిజర్వేషన్ల పంచాయతీ.. రేవంత్ ప్లాన్ ఏంటి

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతగానో పట్టు పట్టింది. దానికోసం చాలా ప్రయత్నాలు కూడా చేసింది. కానీ ఏం లాభం చివరకు కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఒక్క పిటిషన్ వేస్తే చివరకు జీవోను రద్దు చేసే పరిస్థితి వచ్చింది. చట్టపరంగా రిజర్వేషన్లు 50 శాతం మించకూడదు అని నిబంధన ఇప్పుడు పెద్ద సంకటంలా మారింది. హైకోర్టులో ఈ విషయం ఇప్పట్లో తేలేలా లేదు. విచారణకు ఇంకో నెల సమయం ఉంది. కానీ అప్పటిదాకా స్థానిక సంస్థలు ఎన్నికలను ఆపడం కష్టం. ఒకవేళ అప్పటివరకు ఆపినా అనుకూలమైన తీర్పు వస్తుందనే నమ్మకం లేదు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను పరిశీలించాలని హైకోర్టు సూచిస్తోంది. కాబట్టి ఇప్పుడు హైకోర్టులో తేల్చుకోవడం కంటే సుప్రీంకోర్టుకు వెళ్లాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. సుప్రీంకోర్టులో ఈ రిజర్వేషన్ల అంశంపై పోరాడాలని నిర్ణయం తీసుకుంది. ఇంకోవైపు పాత పద్ధతిలో నోటిఫికేషన్ ఇవ్వడానికి కూడా రెడీ అవుతోంది.
కాంగ్రెస్ ఢిల్లీ హై కమాండ్ బీసీల ఓట్ల కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే బీసీలకు 42% రిజర్వేషన్ తీసుకువచ్చింది అనడంలో సందేహం లేదు. కాబట్టి ఇప్పుడు ఈ అంశాన్ని పక్కన పెట్టడం కంటే హై కమాండ్ కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం కరెక్ట్ అని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. ఈ అంశాన్ని హైలెట్ చేస్తూనే పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థలు ఎన్నికలలో కాంగ్రెస్ ఇవ్వబోతోంది. చట్టపరంగా కుదరకపోయినా పార్టీ పరంగా ఇచ్చి ప్రజల్లో మెప్పు పొందాలని చూస్తోంది. ఇంకోవైపు సుప్రీంకోర్టును ఈ అంశంపై పోరాడుతూ కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు దాని గురించి పార్లమెంట్లో కూడా చర్చించేందుకు సిద్ధమవుతున్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కి ఈ రిజర్వేషన్ల అంశం పెద్ద అస్త్రం అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.
బిజెపి హిందూ ఎజెండాతో వస్తే కాంగ్రెస్ పార్టీ దేశంలో అత్యధికంగా ఉన్న బీసీల జనాభా లెక్కలతో వస్తోంది. కానీ చట్టపరంగా ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది తెలియదు. ఎందుకంటే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో వర్గం ఒక్కో కులం కిందకు వస్తుంది. కాబట్టి బీసీలు ఎవరు అనే అంశాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నిస్తే చెప్పడం కూడా కష్టమే. అందుకే ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం తమ చేతిలో పెట్టుకోవడం కంటే కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు చేతుల్లో పెడితేనే కరెక్ట్ అని ఆలోచిస్తుంది. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు బీసీ సంఘాల నుంచి కాంగ్రెస్ కు అంతో ఇంతో మద్దతు వస్తుంది. కాబట్టి దీన్ని కాపాడుకునేందుకు స్థానిక సంస్థలు ఎన్నికల్లో అర్జెంటుగా పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చి.. ప్రతిపక్షాలకు సవాల్ విసరడానికి రెడీ అవుతున్నారు. చూడాలి మరి రెండు రోజుల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com