TG : విదేశాల్లో రేవంత్.. పక్క రాష్ట్రాల్లో మినిస్టర్స్... హరీశ్ విసుర్లు

సీఎం రేవంత్ రెడ్డి విదేశాల్లో... మంత్రులు అందరూ పక్క రాష్ట్రాల్లో బిజీగా ఉంటే ఇక ప్రజలను ఎవరు పట్టించుకోవాలని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వానిది ప్రజాపాలన కాదని... ముమ్మాటికి ప్రజావ్యతిరేక పాలన అన్నారు. సోకాల్డ్ ప్రజాపాలన పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు. పథకాల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్న గ్రామసభల సాక్షిగా ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న ఆగ్రహం తెలుస్తోందన్నారు.
ఊరూరా జనం తిరగబడుతున్నారని, ఎక్కడికక్కడ నిలదీస్తున్నారని హరీశ్ రావు తెలిపారు. కాంగ్రెస్ ఏడాది పాలన పెద్ద ఫెయిల్యూర్ అని వ్యాఖ్యానించారు. ఇందిరమ్మ రాజ్యంలో పోలీసు పహారా నడుమ గ్రామ సభలను నిర్వహించే పరిస్థితులు వచ్చాయన్నారు.
పథకాల లబ్ధిదారులను ఎంపిక చేయడానికి ఓ వైపు గ్రామసభలు నిర్వహిస్తుంటే మరోవైపు కార్యకర్తలకే పథకాలు ఇస్తామని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కార్యకర్తలకే పథకాలు ఇస్తున్నప్పుడు ఇక గ్రామసభలు ఎందుకని హరీశ్ రావు ప్రశ్నించారు. అంటే అర్హులైన వారికి ఇవ్వడం లేదని అర్థమేగా? అని విమర్శించారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com