TG : రాజకీయ కురవృద్ధుడు శిబూ సోరెన్ మృతి పట్ల రేవంత్, కేటీఆర్ సంతాపం..

TG : రాజకీయ కురవృద్ధుడు శిబూ సోరెన్ మృతి పట్ల రేవంత్, కేటీఆర్ సంతాపం..
X

జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబూ సోరెన్ మృతి పట్ల దేశ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. గురూజీతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.

జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర సాధనతో పాటు..గిరిజన సమస్యల పరిష్కారంలోనూ మడమతిప్పని పోరాటం చేసిన యోధుడు గురూజీ శిబూ సోరెన్ అని కొనియాడారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు శిబూ సోరెన్ ఎల్లప్పుడూ మద్దతు తెలిపేవారని.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి సైతం చివరి వరకు దన్నుగా నిలబడ్డారని గుర్తు చేశారు. ఆదివాసీ సమాజానికి గురూజీ చేసిన సేవలు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సైతం శిబూ సోరెన్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన ఆయన.. "భారత రాజకీయాల్లో ఒక మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఆయన మరణం తీవ్రమైన బాధను కలిగించిందని ఇది న్యాయం, గుర్తింపు, గౌరవం పట్ల అచంచలమైన నిబద్ధతతో ఏర్పడిన ఒక శకానికి ముగింపును సూచిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నైతిక ప్రోత్సాహం అందించారని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ప్రజలు, BRS కుటుంబం తరపున హేమంత్ సోరెన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.

Tags

Next Story