TG : రేపు ఎమ్మెల్యేలతో రేవంత్, మున్షీ భేటీ

TG : రేపు ఎమ్మెల్యేలతో రేవంత్, మున్షీ భేటీ
X

రేపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఆ పార్టీ రాష్ట్ర అధిష్ఠానం భేటీ కానుంది. వారిని నాలుగు గ్రూపులుగా విడదీసి సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఇంఛార్జి దీపాదాస్ మున్షీ, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సమావేశం కానున్నారు. ఇటీవల జరుగుతున్న పరిణామాలు, కులగణనపై ప్రచారం వంటి అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

అయితే కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం మాత్రం పార్టీలో ఎలాంటి అంతర్గత పోరు లేదని.. అది చాలా చిన్న విషయమనే సంకేతాలు పంపుతుంది. మరోవైపు భేటీలో పాల్గొన్న ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా.. ఇది రహస్య సమావేశం కాదని, విందు కోసం మాత్రమేనని చెబుతున్నారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం కాంగ్రెస్‌లో అంతర్గత పోరు కొనసాగుతుందని.. రేవంత్ రెడ్డిపై తిరుగుబాటు మొదలైందని ఆరోపిస్తూ ప్రచారం చేస్తున్నారు.

మరోవైపు అసెంబ్లీ సెక్రటరీ నోటీసుల నేపథ్యంలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు దానం నాగేందర్ నివాసంలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో సమావేశమయ్యారు. న్యాయపరంగా ముందుకెళ్లే అంశం, అసెంబ్లీ సెక్రటరీ, సుప్రీంకు సమాధానం ఇవ్వడంపై చర్చిస్తున్నట్లు సమాచారం. అవసరమైతే ఢిల్లీకి వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Tags

Next Story