REVANTH: మేడిగడ్డ అణాపైసాకు పనికిరాదు.. ఇసుకపై మేడిగడ్డ నిర్మించారన్న రేవంత్‌రెడ్డి....

REVANTH: మేడిగడ్డ అణాపైసాకు పనికిరాదు..   ఇసుకపై మేడిగడ్డ నిర్మించారన్న రేవంత్‌రెడ్డి....
KCR తిన్న లక్ష కోట్లు కక్కిస్తామని ప్రకటన

తెలంగాణలో శాసనసభ ఎన్నికలకు నామినేషన్ల దాఖలుకు గడువు ముగియగా.. కాంగ్రెస్‌ ప్రచారజోరు పెంచింది. విజయభేరీ సభలో పేరుతో... విస్తృతంగా పర్యటిస్తున్న తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇవాళ మూడు సభల్లో పాల్గొనన్నారు. తొలుత మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న రేవంత్‌ బీఆర్‌ఎస్‌ సర్కారుపై పదునైన విమర్శలు చేశారు. కాంగ్రెస్‌కు పట్టాదారుల్లో కాకా కుటుంబం ఒకటన్న రేవంత్‌ చెన్నూరులో వివేక్‌, బెల్లంపల్లిలో వినోద్‌ను గెలిపించాల్సిన బాధ్యత ఇక్కడి ప్రజలకు ఉందని సూచించారు. తెలంగాణలో ఇసుకపై కట్టిన మేడిగడ్డ ఇక అణాపైసాకు పనికిరాదని అన్నారం అక్కరకు రాదని TPCC అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఇసుక మీద ప్రాజెక్టులు ఎవరైనా కడతారా అని సీఎం KCRను ప్రశ్నించారు. రామగుండంలో ఓపెన్‌కాస్ట్‌ మైనింగ్‌ మూసివేయిస్తామన్న KCR ఎక్కడికి వెళ్లారని నిలదీశారు. అనంతరం ధర్మపురి బహిరంగ సభలో పాల్గొన్న రేవంత్‌ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అవినీతివల్లే మేడిగడ్డ, అన్నారం మళ్లీ నిర్మించాల్సిన పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు.

ఓపెన్ కాస్ట్ మైనింగ్‌లు బంద్ చేయిస్తానన్న KCR ఆ హామీని ఎందుకు నెరవేర్చలేదని రామగుండం సభలో రేవంత్‌ విమర్శించారు. ఇసుక, బొగ్గు, బూడిద ఏదీ వదలకుండా దోచుకుని ఇక్కడి ఎమ్మెల్యే బంధిపోటు దొంగలా మారారని విమర్శించారు. కల్వకుంట్ల కుటుంబానికి కప్పం కడుతుండు కాబట్టే మళ్లీ ఎమ్మెల్యేకు టికెట్ కేటాయించారని వ్యాఖ్యలు చేశారు. సింగరేణి కార్మికుల ఎన్నికలను కోర్టుకు పోయి వాయిదా వేయించారన్నారు. కేసీఆర్ మొగోడే అయితే సింగరేణి ఎన్నికలను ఎందుకు జరపలేదని ప్రశ్నించారు. రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ, ఉద్యోగాల భర్తీ జరగాలన్నా కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. ప్రతీ నెలా రేషన్ సన్న బియ్యం రావాలంటే కాంగ్రెస్ గెలవాలన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ విజయం ఖాయమైందన్న రేవంత్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ ఇస్తామని 58లక్షల రైతులకు రైతు భరోసా అందిస్తామని పునరుద్ఘాటించారు. ప్రతీ నెలా రేషన్ సన్న బియ్యం రావాలంటే కాంగ్రెస్ గెలవాలన్నారు. మహిళలకు ప్రతీ నెలా రూ.2500 రావాలంటే రాష్ట్రంలో కాంగ్రెస్ రావాలని చెప్పుకొచ్చారు. రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని హామీ ఇచ్చారు. బిల్లు చూడగానే కరెంట్ షాక్ కొట్టే పరిస్థితి ఏర్పడిందన్నారు. రైతులకు, కౌలు రైతులకు ప్రతీ ఏటా ఎకరాకు రూ.15వేలు, రైతు కూలీలకు రూ.12వేలు అందిస్తామన్నారు. చేయూత పథకం ద్వారా నెలకు రూ.4000 పెన్షన్ అందిస్తామని తెలిపారు. సింగరేణి కార్మికుల సొంత ఇంటి కల నెరవేరాలంటే కాంగ్రేస్ అధికారంలోకి రావాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Tags

Next Story