REVANTH: చంద్రబాబుతో పూర్తిగా ఏకీభవిస్తున్నా
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి రంగం సిద్ధమైంది. విభజన సమస్యలపై చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేయాలన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతిపాదనపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ నెల 6న హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిరావు ఫులే ప్రజాభవన్‌లో చర్చలకు రావాలని చంద్రబాబును... రేవంత్‌రెడ్డి ఆహ్వానించారు. ఈ మేరకు చంద్రబాబుకు రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. విభజన సమస్యలను పరిష్కరించుకోవడానికి చర్చలు జరపాలంటూ లేఖ రాసినందుకు చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన రేవంత్‌రెడ్డి... ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో అద్వితీయ విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు. స్వతంత్ర భారతదేశంలో నాలుగోసారి సీఎంగా ప్రమాణం చేసిన అతికొద్ది మంది రాజకీయ నేతల సరసన మీరూ చేరడం సంతోషంగా ఉందని రేవంత్‌రెడ్డి లేఖలో పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ముఖాముఖి చర్చించాలన్న చంద్రబాబు సూచనలతో పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు రేవంత్‌రెడ్డి తెలిపారు.
విభజన చట్టానికి సంబంధించిన అంశాల పరిష్కారం అత్యవసరమన్న తెలంగాణ ముఖ్యమంత్రి... రెండు రాష్ట్రాల ప్రజలకు మరింతగా సేవలు అందించేందుకుఈ సమావేశం తప్పనిసరని కూడా అన్నారు. ఈ నెల 6న మధ్యాహ్నం ప్రజాభవన్‌లో చర్చలకు రావాల్సిందిగా తెలంగాణ ప్రజలు, ప్రభుత్వం తరఫున మిమ్మల్ని ఆహ్వానిస్తున్నానని చంద్రబాబుకు రాసిన లేఖలో రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
చంద్రబాబు లేఖ ఇలా...
ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తయిన సందర్భంలో సంబంధిత అంశాలపై ముఖాముఖి చర్చించుకుందామని ప్రతిపాదించారు. ఇందుకు రేవంత్ కూడా అంగీకరించారు. దీనిపై నేడు రేవంత్‌రెడ్డి లిఖితపూర్వకంగా స్పందన తెలియచేయనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం అధికారికంగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రులతోపాటు రెండు రాష్ట్రాల నుంచి ఇద్దరు చొప్పున సీనియర్ మంత్రులు, సంబంధిత అంశాలకు సంబంధించిన సీనియర్ అధికారులు కూడా హాజరవుతారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com