Revanth Reddy : గ్లోబల్ సమ్మిట్ తో రేవంత్ భారీ టార్గెట్లు..

Revanth Reddy : గ్లోబల్ సమ్మిట్ తో రేవంత్ భారీ టార్గెట్లు..
X

సీఎం రేవంత్ రెడ్డి గ్లోబల్ సమ్మిట్ ద్వారా భారీ టార్గెట్లు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్పుకునేందుకు అతిపెద్ద వేదికగా దీన్ని మార్చుకోబోతోంది. రేవంత్ రెడ్డి మొదటినుంచి చెబుతున్న ఫ్యూచర్ సిటీకి ఏదో పెద్ద ఊతం లాంటిది. ఇక నిన్న జరిగిన తొలి రోజు సమ్మిట్ బాగానే సక్సెస్ అయింది. జాతీయ, అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు వేలాది మంది తరలివచ్చారు. వచ్చిన వారందరికీ తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తూ ఇక్కడ పెట్టుబడులు పెట్టేలా మార్గం సుగమం చేసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రులకు కీలక బాధ్యతలు అప్పగించి ఒక్కొక్కరికి ఒక్కొక్క సెక్షన్ ఇచ్చారు. ఆ మేరకు వాళ్లు కూడా మీటింగులు పెడుతూ కంపెనీల ప్రతినిధులకు అన్నీ వివరిస్తున్నారు.

ఇక నిన్న మొదటిరోజు రూ.3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రావడం నిజంగా మెచ్చుకోదగ్గ అంశమే. ఈ వచ్చిన పెట్టుబడులు కూడా ఎక్కువగా ఫ్యూచర్ సిటీలోనే ఉండేటట్లు రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. ఆ మేరకు పెట్టుబడిదారులకు ముందే ఈ విషయాలను వెల్లడిస్తున్నారు. అలా ఒప్పుకున్న వారితోనే ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజినల్ రింగ్ రోడ్డు మధ్యలో ఉండే ఫ్యూచర్ సిటీకి రాబోతున్న కంపెనీలు అన్నీ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాయి. ఈ వస్తున్న పెట్టుబడులు తెలంగాణ ముఖచిత్రాన్ని మార్చే విధంగా ఉండాలని రేవంత్ రెడ్డి ముందు నుంచే ప్లాన్ చేసుకుంటున్నారు. గతంలో పనిచేసిన సీఎంలకు చెప్పుకోవడానికి ఏదో ఒక బలమైన ప్రాజెక్టులు ఉన్నాయి. ఇప్పుడు తన హయాంలో ఈ ఫ్యూచర్ సిటీని నిర్మించినట్టు భవిష్యత్తులో చెప్పుకునే అవకాశం ఉండాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.

ఇప్పటికే తెలంగాణను మూడు రీజియన్లుగా విభజించారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఒక సిటీ రీజనల్ రింగ్ రోడ్డు వరకు ఇంకో సిటీ అక్కడి నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు మిగిలిన భూములు ఉంటాయని గతంలోని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మూడు రీజియన్లలో ఒక్కోచోట ఒక్కోరకమైన కంపెనీలను ఒక్కోరకమైన పెట్టుబడులను తీసుకొస్తామని చెబుతున్నారు. ప్రస్తుతం వస్తున్న పెట్టుబడులు మాత్రం ఫ్యూచర్ సిటీలోనే కేంద్రీకృతం అవుతాయని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇండియాలోనే ఫ్యూచర్ సిటీకి ఉండే డిమాండ్ వేరే ఏ రాష్ట్రానికి ఉండొద్దనేది రేవంత్ రెడ్డి ఆలోచన. నేడు కూడా జరగనున్న గ్లోబల్ సమ్మిట్ తో లక్షల కోట్ల పెట్టుబడులు టార్గెట్ గా పెట్టుకున్నారు. మరి ఇందులో ఏ స్థాయి వరకు విజయం సాధిస్తారు అనేది మనం వేచి చూడాలి.

Tags

Next Story