Revanth Reddy : రేవంత్ వ్యాఖ్యలపై రగడ.. వివరణ ఇచ్చినా..!

Revanth Reddy : రేవంత్ వ్యాఖ్యలపై రగడ.. వివరణ ఇచ్చినా..!
X

సీఎం రేవంత్ రెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. నిన్న డిసిసి అధ్యక్షుల సమావేశంలో మాట్లాడుతూ హిందూ దేవుళ్ళపై చేసిన కామెంట్లు కాంట్రవర్సీకి దారితీసాయి. మూడు కోట్ల మంది హిందూ దేవుళ్ళు ఉన్నారని.. వెజ్ తినే వాళ్లకు ఒక దేవుడు, నాన్ వెజ్ తినేవాళ్లకు ఒక దేవుడు, మందు తాగే వారికి ఇంకో దేవుడు ఉన్నట్టు ఆయన చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి. ఇంకేముంది బిజెపి నేతలు ఓ రేంజ్ లో రెచ్చిపోతున్నారు. రేవంత్ వ్యాఖ్యలను తప్పుపడుతూ తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇందులో భాగంగా నేడు బిజెపి నాయకులు రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా గాంధీభవన్ ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. కానీ పోలీసులు వారిని బిజెపి రాష్ట్ర ఆఫీసు వద్దనే అడ్డుకొని అరెస్టు చేశారు.

అసలే హిందూ దేవుళ్ళపై ఎవరు ఏం మాట్లాడినా సరే పెద్ద రచ్చ జరుగుతున్న సంగతి మనం చూస్తూనే ఉన్నాం. మొన్నటికి మొన్న రాజమౌళి హనుమంతుడిపై చేసిన కామెంట్లు నేషనల్ వైడ్ గా కాంట్రవర్సీకి దారితీసాయి. ఇలాంటి సమయంలో ఒక సీఎం స్థాయిలో ఉన్న రేవంత్ ఈ కామెంట్లు చేయడం వల్ల పెద్ద ఇష్యూ అయిపోయింది. తన కామెంట్లపై నేడు ఢిల్లీలో రేవంత్ రెడ్డి వివరణ కూడా ఇచ్చారు. హిందూ దేవుళ్ళ మాదిరిగా డిసిసి అధ్యక్షులు అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండాలని తాను చెప్పిన కామెంట్లను వక్రీకరిస్తూ సోషల్ మీడియాలో ఎడిట్ చేసి తప్పుగా ప్రచారం చేస్తున్నారంటూ చెప్పారు. కానీ తన కామెంట్లు తప్పుగా అనలేదని రేవంత్ ఎక్కడా చెప్పలేదు. తనకు ఇంత పాపులారిటీ ఇస్తున్నందుకు థాంక్స్ అంటూ సెటైర్ వేశారు.

దీంతో వివాదం అస్సలు ఆగట్లేదు. అసలే కాంగ్రెస్ హిందూ వ్యతిరేక పార్టీ అంటూ బిజెపి ఇప్పటికే ఓ రేంజ్ లో ప్రచారం చేస్తూనే ఉంది. పైగా మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో రేవంత్ మాట్లాడుతూ కాంగ్రెస్ అంటే ముస్లింల పార్టీ అంటూ కామెంట్ చేశారు. ఇంకేముంది ఇప్పుడు వాటన్నింటినీ బిజెపి తెరమీదికి తీసుకొస్తూ రేవంత్ ను తీవ్రంగా తప్పుపడుతూ ప్రచారం చేస్తుంది. అటు హిందూ సంఘాలు కూడా రేవంత్ వ్యాఖ్యలపై మండిపడుతున్నాయి. హిందూ దేవుళ్లను అవమానించే విధంగా రేవంత్ కామెంట్లు ఉన్నాయంటూ విమర్శలు గుప్పిస్తున్నారు హిందూ సంఘాల నేతలు. చూస్తుంటే ఈ వివాదం ఇక్కడితో ఆగేటట్లు కనిపించట్లేదు. బిజెపికి ఇన్ని రోజులకు సరైన కారణం దొరికింది కాబట్టి దీన్ని ఎక్కువగా హైలెట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి బిఆర్ఎస్ దీనిపై ఏమైనా స్పందిస్తుందా లేదా అనేది చూడాలి.

Tags

Next Story