Telangana : పెరుగుతున్న ఎండలు..ఒంటిపూట బడులకు అంతా సిద్ధం

రాష్ట్రంలో వేసవి తీవ్రత అంతకంతకూ పెరుగుతుండడంతో ఒంటిపూట బడుల నిర్వహణపై పాఠశాల విద్యాశాఖ దృష్టిసారించింది. ఈ ఏడాది ఎండలు మండుతాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్ నగరంతో పాటు జిల్లాల్లో పగటి పూట అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో వడదెబ్బ సోకే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. పెరుగుతున్న ఎండల నేపథ్యంలో పిల్లలకు ఒంటిపూట బదులు నిర్వహిస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎండ వేడిమి ఇలాగే కొనసాగితే మార్చి మెదటి వారం నుంచే ఒంటిపూట బడులు నిర్వహించే అవకాశం ఉందని పాఠశాల విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో ఉదయం 10 గంటలు దాటగానే సూర్యుడు భగభగమంటున్నాడు.
మార్చి నెల కూడా రాకుండానే ఎండల తీవ్రత తీవ్రంగా ఉండడంతో రోడ్ల వెంట బండ్లు పెట్టుకుని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు మలమలలాడిపోతున్నారు. ఇక బళ్లకు వెళ్లే విద్యార్థుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఎండల్లో స్కూల్కు వెళ్లేందుకు నానా అవస్థలు పడుతున్నారు. దీంతో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కాస్త ముందుగానే ఒంటిపూట బడులు నిర్వహించాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. ప్రభుత్వం కూడా ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ఇంత ఎండల్లో చిన్నారులను బయటకు పంపిచడం సబబు కాదనే అభిప్రాయం తల్లిదండ్రుల నుంచి వ్యక్తమవుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాలలో 35 డిగ్రీల నుండి 37 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. రాబోయే వారంతో ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఎండల ధాటికి ఆరోగ్య సమస్యలు తప్పవని కూడా వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం, అతిత్వరలో ఒక్క పూట బడులపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. మార్చి తొలి వారంలో ఒంటి పూట బడులు పెడితే, విద్యార్థులకు ఎండల తీవ్రత నుండి ఊరట లభిస్తుందని అధికారులు భావిస్తున్నట్టు సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com