Indiramma House : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రూ.146.3 కోట్లు రిలీజ్

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద లబ్ధిదారులకు ఇటీవల రూ.146.3 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులను 13,841 మంది లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఈ తాజా చెల్లింపుతో కలిపి, పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం రూ.1435 కోట్లు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 2.15 లక్షల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. ఇందులో 1.29 లక్షల ఇళ్లు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి. లబ్ధిదారులకు నిధుల చెల్లింపును నిర్మాణ దశను బట్టి, నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఈ ప్రక్రియ ప్రతి సోమవారం జరుగుతుంది. సొంత స్థలం ఉన్నవారికి ఇల్లు కట్టుకోవడానికి రూ.5 లక్షలు, స్థలం లేని వారికి స్థలంతో పాటు రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తారు. పథకంలో పారదర్శకత కోసం, లబ్ధిదారులే యాప్ ద్వారా తమ ఇంటి నిర్మాణ ఫోటోలను అప్‌లోడ్ చేసి బిల్లులు పొందే సౌకర్యం కల్పించారు. ఇసుక వంటి నిర్మాణ సామాగ్రిని తక్కువ ధరకే అందిస్తూ ప్రభుత్వం లబ్ధిదారులకు అదనపు సహాయం అందిస్తోంది. లబ్ధిదారులను ప్రజాపాలన దరఖాస్తుల ఆధారంగా ఎంపిక చేశారు. వీరు బీపీఎల్ (దారిద్య్రరేఖ దిగువన) కుటుంబాలకు చెందినవారై ఉండాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com