Indiramma Houses : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు రూ.1618 కోట్లు చెల్లింపు

ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా లబ్ధిదారులకు రూ. 1618 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ శ్రీ వి.పి.గౌతం తెలిపారు. అర్హులైన పేదలందరికీ సొంత ఇంటి వసతి కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తున్నదనీ, ఈ పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2.12 లక్షల ఇళ్ల పనులు ప్రారంభం కాగా, ఇంతవరకు సుమారు ఒక లక్షా యాభై వేలకు పైగా చెల్లింపులు చేసినట్లు ఆయన బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంటి నిర్మాణపు పనుల దశలను బట్టి లబ్ధిదారులకు విడతల వారీగా మొత్తం 5 లక్షల రూపాయలను వారి ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నామని వివరించారు. లబ్ధిదారుల్లో ఎవరికైనా బిల్లు మొత్తం జమ కానిపక్షంలో, వారు తమ అక్కౌంట్ ఉన్న బ్యాంకుకు వెళ్లి ఆధార్ నెంబర్ ను ఖాతాకు అనుసంధానించుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12 వేల పైచిలుకు గ్రామాలు, సుమారు 4 వేల మున్సిపల్ వార్డుల్లో ఇందిరమ్మ ఇండ్ల పనులు జోరుగా సాగుతున్నాయని, అనేక ప్రాంతాల్లో ప్రతినిత్యం ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. పూర్తి పారదర్శకమైన విధానంతో, అధునాతన టెక్నాలజీని వినియోగించుకుంటూ ప్రతి సోమవారం నాడు లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా డబ్బులు జమ చేస్తున్నామన్నారు. అందులో భాగంగా ఈ వారంలోనే (24 Sep నాటికి) రికార్డు స్థాయిలో 17 వేల ఇండ్ల పురోగతికి సంబంధించిన బిల్లుల నిమిత్తం రూ.188.35 కోట్లను లబ్ధిదారులకు విడుదల చేసినట్లు ఆ ప్రకటనలో తెలిపారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com