SCHEME: రాజీవ్ యువ వికాసం పథకానికి రూ.1,000 కోట్లు

నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘రాజీవ్ యువ వికాసం’ పథకానికి మరో ముందడుగు పడింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ పథకం కింద రూ.1,000 కోట్లు విడుదల చేయనున్నట్లు డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో జరిగిన 'ఇందిరా సౌర గిరి జల వికాస' పథకం ప్రారంభ సభలో భట్టి మాట్లాడుతూ.. ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ/ఈడబ్ల్యూఎస్ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే రూ.6,000 కోట్ల బడ్జెట్ కేటాయించి, రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల మందికి లబ్ధి చేకూర్చేలా లక్ష్యంగా పెట్టుకున్నారు. అర్హులైన వారికి రూ.4 లక్షల వరకు రాయితీ రుణాలు అందించనున్నారు. ఈ పథకం లబ్ధిదారులకు NSDCతో భాగస్వామ్యంగా ఉచిత నైపుణ్య శిక్షణ అందించనున్నారు. రుణాల కోసం ఎలాంటి ఆస్తులు హామీగా పెట్టాల్సిన అవసరం లేదు. దీనిపై యువత భారీ ఆశలు పెట్టుకుంది.
రాయితీల వివరాలు ఇలా..
రూ.50,000 వరకూ యూనిట్లకు 100% సబ్సిడీ
రూ.50,001 – రూ.1,00,000 వరకూ 90% సబ్సిడీ
రూ.1,00,001 – రూ.2,00,000 వరకూ 80% సబ్సిడీ
రూ.2,00,001 – రూ.4,00,000 వరకూ 70% సబ్సిడీ
అర్హతలు:
తెలంగాణ శాశ్వత నివాసి అయి ఉండాలి.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ/ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు చెందిన నిరుద్యోగ యువత అయి ఉండాలి.
వయసు: సాధారణంగా 21–55 సంవత్సరాలు, వ్యవసాయ రంగానికి 21–60 సంవత్సరాలు
ఆదాయం పరిమితి: గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షల లోపు
కుటుంబానికి ఒక్కరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కుటుంబాల వారికి, ఎస్సీ ఉపవర్గీకరణ ఉద్యమంలో అమరుల కుటుంబ సభ్యులకు, నైపుణ్యం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. నిరుద్యోగాన్ని తగ్గించడం, యువతలో వ్యవస్థాపకతకు ఊతమివ్వడం ప్రధాన లక్ష్యాలుగా ప్రభుత్వం పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com