TG : బీఆర్ఎస్ హయాంలో రూ. 7 లక్షల కోట్ల అప్పులు : సీతక్క

తొమ్మిదన్నరేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికి కొత్త అప్పులు చేయాల్సిన దుస్థితిని తీసుకొచ్చారని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుల వారసత్వానికి ఆద్యులే మీరేనని కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ పాలన రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని విమర్శించిన సీఎం రేవంత్ రెడ్డి 10 నెలల్లో 80,500 కోట్ల రికార్డు అప్పులు చేశారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన విమర్శలకు మంత్రి సీతక్క ట్విటర్ వేదికగానే కౌంటర్ వేశారు. మీ హయాంలో అక్షరాల రూ. 7 లక్షల కోట్ల అప్పులు చేసారని, వాటికి కిస్తీలు, వడ్డీల కోసం ప్రతి రోజు టంచన్‌గా రూ. 207 కోట్లు చెల్లించాల్సి వస్తోందని, ప్రతి నెల సగటున రూ. 6 వేల కోట్ల ప్రజాధనాన్ని అప్పుల కుప్పను కడగడానికే సరిపోతుందని తెలిపారు. అప్పుల అప్పారావు లాగా అందిన కాడల్లా అప్పులు చేసి.. రాష్ట్రాన్ని తిప్పలు పెట్టి, వడ్డీలతో ఆర్థిక వ్యవస్థ నడ్డి విరిచిన మిమ్మల్ని దేనితో కొట్టాలంటూ కాస్త గట్టిగానే రాసుకొచ్చారు. అప్పులు చాలవన్నట్లు వేల కోట్ల బకాయిలను మీరు చెల్లించలేదని, చేసిన పనులకూ బిల్లులు చెల్లించలేందంటూ దుయ్యబట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com