Hyderabad : HCUలో తీవ్ర నిర్లక్ష్యం.. నిర్మాణంలోనే ఉండగానే కూలిన అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గురువారం సాయంత్రం యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ భవనం అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. భవనం నిర్మాణ పనులు కొనసాగుతున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించడంతో, అక్కడే పనిచేస్తున్న ముగ్గురు కార్మికులు తీవ్ర ప్రమాదంలో చిక్కుకున్నారు. ఈ ఘటనతో కార్మికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. భవనం కూలిపోవడం గమనించిన తోటి కార్మికులు, యూనివర్సిటీ సిబ్బంది హుటా హుటిన స్పందించి శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం ప్రారంభించారు. గాయ పడిన కార్మికులను బయటకు తీసుకురావడానికి వారు చాలా శ్రమించారు. ఈ ప్రమాదంలో ఓ కార్మికుడు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. వెంటనే పోలీసులు, యూనివర్సిటీ అధికారులు స్పందించి, అతడిని సమీప ఆసుపత్రికి తరలించారు. గాయపడిన కార్మికుని పరిస్థితిపై ఇంకా స్పష్ట మైన సమాచారం అందలేదని అధికారులు తెలి పారు. భవనం శిథిలాల కింద ఇంకా మరెవరైనా చిక్కుకుని ఉండొచ్చనే అనుమానంతో పోలీసులు, రెస్క్యూ టీమ్స్ అప్రమత్తమయ్యాయి. స్థానిక అగ్నిమాపక సిబ్బందితో కలిసి సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. యూనివర్సిటీ అధికారులు ఈ ఘటనపై విచారణ చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నిర్మాణం ఉన్న భవనం అకస్మాత్తుగా కూలిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. భవనం నిర్మాణ నాణ్యత సరిగా లేకపోవడమే కారణమా? లేదా నిర్మాణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించకపోవడమే దీనికి కారణమా? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com