Revanth Reddy : రేవంత్ కు షాక్ మీద షాక్..కారణాలపై అంతర్మథనం

Revanth Reddy : రేవంత్ కు షాక్ మీద షాక్..కారణాలపై అంతర్మథనం
X

రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. అధికారంలో ఉండి కూడా కరీంనగర్ సిట్టింగ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటును నిలబెట్టుకోలేకపోవటం కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి ఎదురుదెబ్బగానే భావించాలి. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి పెద్ద ఎత్తున ప్రచారం కూడా నిర్వహించారు. తాము అమలు చేసిన కార్యక్రమాలే తమను గెలిపిస్తాయని ప్రచార సభల్లో ఆయన ధీమా వ్యక్తం చేశారు. కానీ ఫలితం మాత్రం అందుకు భిన్నంగా వచ్చింది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయంలో స్వరం మారుస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేతలు రాబోయే రోజుల్లో ఈ దూకుడును మరింత పెంచే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటును బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి దక్కించుకున్నారు. రెండవ ప్రాధాన్యత ఓట్లతో ఆయన విజయం సాధించారు. కాంగ్రెస్ తరపున బరిలో నిలిచిన విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి ఓటమి చవిచూశారు. కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీతో పాటు టీచర్ ఎమ్మెల్సీని కూడా బీజేపీనే గెలిచిన విషయం తెలిసిందే. తెలంగాణలో జరిగిన మొత్తం మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు బీజేపీ దక్కించుకోవటం ఆ పార్టీలో జోష్ నింపింది. సిట్టింగ్ ఎమ్మెల్సీ సీటును కోల్పోవడం రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అధికారంలో ఉండి కూడా కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ సీటును నిలబెట్టుకోలేకపోవటం ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందనే చర్చ కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతోంది.

Tags

Next Story