Ugadi 2022 : తెలుగు రాష్ట్రాలలో ఘనంగా శుభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలు

Ugadi 2022 :  తెలుగు రాష్ట్రాలలో ఘనంగా  శుభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలు
Ugadi 2022 : తెలుగు రాష్ట్రాలలో శుభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి.

Ugadi 2022 : తెలుగు రాష్ట్రాలలో శుభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. వేద పండితుల ఆశీర్వచనాలు.. పంచాగ పఠనంతో హైదరాబాద్ ప్రగతిభవన్, అమరావతి తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం సహా పార్టీ ఆఫీసులు మార్మోగాయి.

ప్రగతిభవన్‌లో అడుగడుగునా పండుగ వాతావరణం, ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. వేద పండితులు బాచంపల్లి సంతోష్‌కుమార్‌ శాస్త్రి పంచాంగ పఠనం చేయగా.. సీఎం కేసీఆర్ ప్రజలందరికీ సుఖశాంతి, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు. ఏ రాష్ట్రం సాధించని అద్భుత ఫలితాలను తెలంగాణ సాధించిందన్నారు. తెలంగాణలో భూములకు విలువ చాలా బాగా పెరిగిందని, రాష్ట్రంలో ఏ మూలన చూసినా ఎకరం పాతిక లక్షలకు తక్కువ లేదని చెప్పుకొచ్చారు. దళిత బంధు పథకం తెలంగాణలో చాలా అద్భుతాలు సృష్టించబోతోందని తెలిపారు. దేశానికి ఆదర్శ రాష్ట్రంగా నిలుస్తున్న తెలంగాణలో కొందరు విభేదాలు సృష్టించాలని చూస్తున్నారని సీఎం కేసీఆర్ విమర్శించారు.

ఇటు అమరావతి తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాలను అధికారికంగా ఉగాది వేడుకల్ని ప్రారంభించారు సీఎం జగన్‌ దంపతులు. అనంతరం పంచాంగ శ్రవణంలో జగన్‌, సతీమణి భారతి పాల్గొన్నారు. పంచాంగకర్తను ముఖ్యమంత్రి జగన్‌ సన్మానించగా.. శారదాపీఠం తరపున జగన్‌కు వస్త్రాలను అందజేశారు సిద్ధాంతి. ఉగాది సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలోను ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్, పార్టీ నేతలు పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం మరింత శక్తివంతంగా తయారవుతోందని బండి సంజయ్‌ తెలిపారు. తెలంగాణలో బీజేపీ చేసే ప్రజా పోరాటాల్లో ప్రజలు కలిసి రావాలని పిలుపునిచ్చారు.

గాంధీభవన్‌లో జరిగిన ఉగాది వేడుకలు, పంచాగ శ్రవణంలో పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. శుభకృత్ నామ సంవత్సరం తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. సోనియాగాంధీ ఏ లక్ష్యసాధనలో భాగంగా రాష్ట్రం ఇచ్చారో ఆ దిశగా కార్యకర్తలు పనిచేయాలన్నారు. ముగ్గరు మహిళల సారథ్యంలో తెలంగాణ ఏర్పడిందని, కానీ.. ఇప్పుడు రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని రేవంత్‌ రెడ్డి విమర్శించారు. అయితే కేంద్రంలో ఓ నాయకుడి మరణ వార్త దిగ్భ్రాంతి కలిగిస్తుందన్న వేద పండితులు శ్రీనివాస మూర్తి పంచాంగ పఠనం చర్చనీయాంశంగా మారింది.

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం ముచ్చింతల్‌ స్వర్ణ భారతి ట్రస్టులో జరిగిన ఉగాది వేడుకల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఉగాదిలో ప్రాచీనమైన సాంప్రదాయాలు దాగి ఉన్నాయని వెంకయ్యనాయుడు అన్నారు. దేశ భాషలందు తెలుగు లెస్స అన్న ఉపరాష్ట్రపతి.. తెలుగు భాషతో పాటు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను విస్మరించకూడదన్నారు. ఇటు అంబర్‌ పేట్‌లోని నల్లకుంట పాత రామాలయంలో జరిగిన పంచాంగ శ్రవణంలో హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి పాల్గొన్నారు.

శుభకృత నామ సంవత్సరం ప్రజల జీవితాల్లో శుభాన్ని కలిగించాలని బండారు దత్తాత్రేయ ఆకాంక్షించారు. మొత్తానికి షడ్రుచుల సమ్మేళనంగా ఉగాది వేడుకలు జరిగాయి. ఈ శుభకృత్ నామ సంవత్సరంలో ప్రతిఒక్కరికీ అన్ని శుభాలే జరగాలని ఆశిద్దాం.

Tags

Read MoreRead Less
Next Story