SLBC Tunnel : ఎస్ఎల్బీసీ సొరంగం రెస్క్యూ జరుగుతున్న తీరు ఇదీ

నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం పై కప్పు కూలడంతో లోపల 8 మంది చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు భారత సైన్యం, నౌకాదళం సహా వివిధ రక్షక బృందాలు ముమ్మరంగా సహాయచర్యల్లో నిమగ్నమయ్యాయి. కాగా సొరంగంలో చిక్కుకున్న ఎనిమిదిమందిని రక్షించేందుకు చేపట్టిన ప్రయత్నాలు రెండోరోజూ ఫలించలేదు. ఆర్మీ, NDRF బృందాలు ప్రయత్నించానా ఫలితం లేకపోయింది. మొత్తం బురదమయంగా ఉండటం, టీబీఎం యంత్రం పై భాగం కుంగిపోవడం, దాంతో పాటు ఇతర పరికరాలు అడ్డంగా పడి ఉండటంతో ముందుకెళ్లలేని పరిస్థితి తలెత్తింది.
మూడు కిలోమీటర్ల వెనక్కు బురద, నీళ్లు ఎగదన్నాయని ప్రత్యక్ష సాక్షులు ఇప్పటికే వెళ్లడించారు. ఆ నీటిని భారీ మోటార్లు పెట్టి ఎత్తిపోస్తూ శ్రీశైలం జలాశయంలోకి తరలిస్తున్నారు. ఐదు అత్యధిక అశ్వ సామర్థ్యం ఉన్న పంపులను వినియోగిస్తున్నారు. 13.5 కిలోమీటరు వద్ద ఒక పంపును మధ్యాహ్నం అందుబాటులోకి తీసుకొచ్చారు. లోపల విద్యుత్ సరఫరా లేని చోట కూలిపోయిన ఇనుప రెయిలింగ్, రాడ్లను తొలగించేందుకు కట్టర్లు కావాల్సి వచ్చింది. సాయంత్రం తరువాత లోపల ఉన్న ఇనుప కడ్డీలను కట్ చేయడం ప్రారంభించారు. వీటన్నింటినీ తొలగిస్తేనే ప్రమాదస్థలం వరకు రక్షణ బృందాలు వెళ్లడానికి వీలవుతుందని ఇంజినీరింగ్ వర్గాలు తెలిపాయి.
శ్రీశైలం జలాశయం వైపు నుంచి 14వ కిలోమీటరు వద్ద సొరంగంలో చోటుచేసుకున్న ప్రమాదం నుంచి బాధితులను కాపాడటం అత్యంత క్లిష్టంగా మారింది. సొరంగం చివరి భాగంలో పనిచేస్తుండగా పైకప్పు కూలిన సమయంలో 8 మంది ఆచూకీ కనిపించకుండా పోయింది. వీరిలో ఎవరైనా, ఏదైనా ఆసరాగా చేసుకుని సాయం కోసం ఎదురుచూస్తూ ఉండవచ్చన్న ఆశలతో సహాయక చర్యలు చేపట్టారు. ఈ కోణంలో డ్రోన్‌తోపాటు, స్కానర్లు, నైట్ విజన్ కెమెరాలతో కూడా దళాలు ప్రయత్నించాయి. టన్నెల్ బోరింగ్ యంత్రం వద్దకు దాదాపు చేరుకున్న కొందరు రక్షణ సభ్యులు బురదలోకి దిగే ప్రయత్నాలు కూడా చేశారు. కానీ కటిక చీకటితోపాటు బురదలో కూరుకుపోయే పరిస్థితి ఉండటంతో వెనక్కు వచ్చేశారు. దూరం నుంచి బిగ్గరగా కేకలు వేస్తూ.. బాధితుల నుంచి స్పందన వస్తుందేమోనని చాలా సేపు ప్రయత్నాలు చేశారు. అటువైపు నుంచి స్పందన లేకపోవడంతో వారి పరిస్థితి ఎలా ఉందన్నది తెలియరాలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com