Sangareddy: వీడిన సగం కాలిన శవం మిస్టరీ.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రేమ వివాహమే కారణం..

Sangareddy: సంగారెడ్డి జిల్లా జిన్నారం అడవీప్రాంతంలో కాలిపోయిన స్థితిలో దొరికిన శవం మిస్టరీ వీడుతోంది. కేపీహెచ్‌బీలో గతనెల 27న అదృశ్యమైన యువకుడిని హత్యచేసి దాహనం చేసినట్లు పోలీసులు తేల్చారు. ఈ హత్యకు ప్రేమ వివాహమే కారణమని స్పష్టమైంది. నలుగురు నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా ఏపీలోని పొదల కొండపల్లికి చెందినవారే.
ప్రకాశం జిల్లా పొదల కొండపల్లికి చెందిన నారాయణ రెడ్డి.. ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తూ కేపీహెచ్‌బీ కాలనీలో ఉంటున్నాడు. ఏడాది కిందట తన స్వగ్రామానికే చెందిన యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ వివాహాన్ని అంగీకరించని యువతి కుటుంబీకులు ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. అయినా ఈ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం కొనసాగుతుందనే అనుమానంతో యువతి కుటుంబీకులు నారాయణ రెడ్డిపై పగ పెంచుకున్నారు.
అంతమొందించేందుకు కుట్ర పన్నినట్లు పోలీసులు తెలిపారు. గత నెల 27న శ్రీనివాస్‌రెడ్డిని కలిసేందుకు వెళుతున్నట్లు రూమ్ మెట్స్‌కు చెప్పిన నారాయణరెడ్డి రాత్రయినా రాకపోవడం, ఫోన్ కూడా స్విచాఫ్ అవడంతో.. అతని స్నేహితులు నారాయణరెడ్డి బావకు సమాచారం అందించారు. 30న నారాయణరెడ్డి బావ ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు హత్య కేసును చేధించారు. కారు డ్రైవర్ షేక్ ఆషిక్ ఇచ్చిన సమాచారంతో జిన్నారం అటవీప్రాంతంలో సగం కాలిన స్థితిలో శవాన్ని స్వాధీనం చేసుకున్నారు.
నారాయణరెడ్డిని మాట్లాడుకుందాం రమ్మంటూ పిలిచిన యువతి బంధువు శ్రీనవాస్ రెడ్డి.. షేక్ ఆషిక్ కారులో రాయరుద్గం వెళ్లి ఫుల్లుగా మద్యం తాగించి, మరొకరి సహకారంతో గొంతు నులిమి హత్య చేశారని, శవాన్ని మాయం చేసే ఉద్దేశ్యంతో నగర శివారు అటవీ ప్రాంతంలోకి తీసుకొచ్చి పెట్రోల్ పోసి దహనం చేసినట్లుగా పోలీసులు తెలిపారు. నిందితులంతా పొదల కొండపల్లికే చెందిన వారని, ఒకరిని అదుపులోకి తీసుకున్నామని, మిగతావారి కోసం గాలిస్తున్నట్లు కేపీహెచ్‌బీ, జిన్నారం సీఐలు కిషన్‌కుమార్, వేణు కుమార్ తెలిపారు. యువతి కుటుంబసభ్యులు మరికొందరి ప్రమేయం పైనా, సుపారీ కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com