GHMC Special App : చెత్త పారేసేవారిని పట్టుకునేందుకు ప్రత్యేక యాప్

పరిసరాల పరిశుభ్రత, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడంలో భాగంగా హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) మరో ముందడుగు వేసింది. ప్రజల్లో పరిసరాల పరిశుభ్రతపై అవగాహన పెంచి మరింత బాధ్యతయుతంగా వ్యవహరించేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా.. వాటిని ఉల్లంఘిస్తే మొక్కుబడిగా జరిమానాలు విధించడం జరుగుతూ వచ్చింది. కానీ ఇక నుంచి వాటిని పక్కాగా అమలు చేసే దిశగా జీహెచ్ఎంసీ చర్యలు చేపడుతోంది. ఈ జరిమానా విధా నాన్ని పారదర్శకంగా నిర్వహించేందుకు ఒక ప్రత్యేక మొబైల్ యాపు రూపొందిస్తోంది. ఈ యాప్ను టీసీఎస్ సంస్థ అభివృద్ధి చేయనుండగా.. వచ్చే నెలలో ఇది పూర్తవుతుందని అధికారులు వెల్లడించారు. యాప్ పూర్తయిన వెంటనే.. అధి కారులకు దీని వినియోగంపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణలోనే ప్రతీ అంశంపై పూర్తిగా అవగాహన తీసుకురానున్నారు.
అధికారులు అవగాహన వస్తేనే.. ప్రజలకు వివరించ గలరని దీని ఉద్దేశ్యం. ఇక నుంచి వీటిని పక్కాగా అమలు చేయనున్నారు. ఇక ఈ యాప్ ఎలా పనిచేస్తుందంటే.. ప్రతి అధికారికి లాగిన్ వివరాలు ఇవ్వబడతాయి. వాటిలో ఉల్లంఘన జరిగినప్పుడు ఫొటో తీసి యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఉల్లంఘన చేసిన వ్యక్తి పేరు, చిరునామా, జరిమానా మొత్తం అధికారి పేరు ఆధారంగా డిజిటల్ రసీదు జనరేట్ అవుతుంది. అప్పటికప్పుడు తప్పు చేసిన వ్యక్తికి ఆ మొబైల్ నంబర్కు వాట్సాప్ ద్వారా లేదా.. మెసేజ్ ద్వారా సమాచారం అందిస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com