Telangana : స్థానిక ఎన్నికలపై స్టే.. ఏం జరగబోతోంది..?

Telangana : స్థానిక ఎన్నికలపై స్టే.. ఏం జరగబోతోంది..?
X

అంతా అనుకున్నట్టే జరిగింది. బీసీ రిజర్వేషన్ల జీవో మీద హైకోర్టు స్టే విధించింది. ఈ రోజు ఉదయమే ఈ జీవో ఆధారంగా ఈసీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. నేటి నుంచి స్థానిక ఎన్నికలకు నామినేషన్ వేసుకోవచ్చని తెలిపింది. కానీ ఇంతలోనే భారీ ట్విస్ట్.. నోటిఫికేషన్ మీద, జీవో నెంబర్ 9 మీద స్టే విధించింది కోర్టు. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. దీంతో అంతా టెన్షన్ మొదలైంది. అసలు ఎన్నికలు ఉంటాయా లేదా అనే వాతావరణం ఏర్పడింది. ఎందుకంటే రిజర్వేషన్ల అంశం కోర్టులో తేలేదాకా ఆ జీవో ఆధారంగా ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదు.

కోర్టులో తేలేదాకా వాయిదా వేస్తే కుదరదు. ఎందుకంటే ఇప్పటికే స్థానిక ఎన్నికలు చాలా లేట్ అయిపోయాయి. ఇలాంటి టైమ్ లో ఇంకా ఆలస్యం చేస్తే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం ఖాయం. కాబట్టి ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది అర్థం కావట్లేదు. ఒకవేళ జీవోను పక్కన పెడితే మళ్లీ మొదటి నుంచి షెడ్యూల్ ప్రకటించాల్సిందే. అంటే అప్పుడు రిజర్వేషన్లు లేకుండా పాత పద్ధతిలోనే వెళ్లాలన్నమాట. ఆ పని చేస్తే ప్రభుత్వం పరువు పోతుంది. ఇలా జరురగుతుందని ముందే తెలియదా అని ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తాయి. బీసీల నుంచి వ్యతిరేకత వచ్చే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి పాత పద్ధతిలో కాకుండా బీసీలకు రిజర్వేషన్లతోనే వెళ్లాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది.

కానీ దానికి సమయం పడుతుంది. కచ్చితంగా ఎన్నికలు వాయిదా వేయాల్సి వస్తుంది. ప్రస్తుతం బీసీ సంఘాలు నిరసనలకు పిలుపునిచ్చాయి. రేపటి నుంచే ధర్నాలు, రాస్తారోకోలు ఉంటాయని హెచ్చరించాయి. దీంతో స్థానిక ఎన్నికల చుట్టూ కొత్త వివాదాలు మొదలయ్యాయి. కోర్టులో నెల రోజుల తర్వాత విచారణ ఉండనుంది. నోటిఫికేషన్ ప్రకారం అయితే ఆ లోగా ఎన్నికలు కూడా పూర్తయిపోతాయి. మరి కోర్టు కాపీ వచ్చిన తర్వాత ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాల్సి ఉంది. ఈ అంశంపై ఇప్పుడు ప్రతిపక్షాలు నానా రచ్చ చేస్తున్నాయి. కావాలనే బీసీల ఎమోషన్స్ తో ఆడుకుంటున్నారని అంటున్నారు. సీఎం రేవంత్ మరికొద్ది సేపట్లే మంత్రులతో సమావేశం నిర్వహిస్తారని తెలుస్తోంది. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

Tags

Next Story