KCR : వ్యూహాత్మకంగా బీఆర్ ఎస్ ప్రచారం.. జూబ్లీహిల్స్ దక్కుతుందా..?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను బీఆర్ ఎస్ పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఎన్నికల కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నట్టు కనిపిస్తోంది. వ్యూహాత్మకంగానే ఈ ఎన్నికల్లో ప్రచారం చేస్తోంది. రాబోయే గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వ్యూహాలు రచిస్తోంది. ముందుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తూనే.. ఇతర గ్రేటర్ వర్గాలను ఈ ఎన్నికల్లోనే కవర్ చేస్తున్నారు. ఈ రోజు ఆటో కార్మికుల సమస్యలను తెలుసుకోవడం.. ఆటోలో ప్రయాణించడం కూడా ఇందులో భాగమే. జూబ్లీహిల్స్ లోని బస్తీ దవాఖానాల్లో సమస్యలను కూడా ప్లాన్ ప్రకారమే హైలెట్ చేస్తోంది గులాబీ పార్టీ. కేసీఆర్ హయాంలో బస్తీ దవాఖానాలను అద్భుతంగా నడిపించామని.. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో అధ్వానంగా తయారయ్యాయని ప్రచారం చేస్తోంది బీఆర్ ఎస్ పార్టీ.
అలాగే హైడ్రా బాధితులతో బీఆర్ ఎస్ మమేకం అవుతున్నారు. దీపావళి వేడుకలను హైడ్రా బాధితులతో నిర్వహించి వారికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ఒక్కో వర్గాన్ని, ఒక్కో డివిజన్ ప్రజలను దృష్టిలో పెట్టుకుని ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ 23 నెలల అధికారంలో ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో ఇవ్వలేదని ఇంటింటికీ వెళ్లి వివరిస్తోంది బీఆర్ ఎస్ పార్టీ. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రధానంగా ఉన్న యాదవ కమ్యూనిటీకి తాము సబ్సిడీ గొర్రెలని ఇస్తే.. కాంగ్రెస్ వచ్చాక ఆ స్కీమ్ ను రద్దు చేసిందంటూ ప్రచారం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ లో బీఆర్ ఎస్ హయాంలో చేసిన చాలా పనులను లోకల్ గా ఉండే ప్రజలకు వివరిస్తున్నారు.
పైగా మాజీ సీఎం కేసీఆర్ దగ్గరుండి ఈ ఎన్నికలకు వ్యూహాలను అందిస్తున్నారంట. ఎందుకంటే ఈ ఎన్నికల్లో గెలిస్తే గ్రేటర్ లో పట్టు తగ్గలేదని నిరూపించుకుని.. కాంగ్రెస్ మీద వ్యతిరేకత పెరిగిందనే వాదనను నిజం చేసినట్టు అవుతుందని భావిస్తున్నారు. అలాగే రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా దీని ఎఫెక్ట్ బలంగానే ఉండబోతోంది. ఆ తర్వాత వచ్చే గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల్లోనూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తమ పట్టును కాపాడుకోవాలని బీఆర్ ఎస్ చూస్తోంది. సిట్టింగ్ సీటు కాబట్టి ఓడిపోతే ఇన్ని రోజులు తాము చేస్తున్న ప్రచారం అంతా ఉత్తదే అవుతుందనే టెన్షన్ బీఆర్ ఎస్ లో ఉంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

