TG : ఇద్దరు ఎమ్మెల్యేల స్ట్రీట్ ఫైటింగ్.. రణరంగంగా కౌశిక్ రెడ్డి నివాసం

తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ ఫైట్ రాజకీయాలను హీటెక్కించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసం రణరంగంగా మారింది. బీఆర్ఎస్,కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. తనకు సవాల్ చేసిన కౌశిక్ రెడ్డితో తాడోపేడో తేల్చుకుంటానంటూ కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ. తన అనుచరులతో కలిసి భారీ కాన్వాయ్ తో వెళ్లారు. కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకోగానే గాంధీ అనుచరులు రెచ్చిపోయారు. కౌశిక్ రెడ్డిపై కోడిగుడ్లతో దాడి చేశారు. కౌశిక్ రెడ్డి ఇంట్లోకి చొచ్చుకువెళ్లిన కాంగ్రెస్ కార్యకర్తలు వీరంగం వేశారు. రాళ్ల దాడి చేయడంతో కౌశిక్ రెడ్డి ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి.
పోలీసులు రంగ ప్రవేశం చేసి కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడి నుంచి తరిమేశారు. ఎమ్మెల్యే గాంధీని పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి నార్సింగ్ పీఎస్‌కు పోలీసులు తరలించారు. తనపై కాంగ్రెస్ గుండాలు దాడి చేశారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. గాంధీని ఉద్దేశించి తొడగొట్టి సవాల్ చేశారు. రేపు గాంధీ అంతు చూస్తానని బెదిరించారు. పోలీసులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కౌశిక్ రెడ్డి. తనను హౌజ్ అరెస్ట్ చేసిన పోలీసులు.. గాంధీని ఎందుకు చేయలేదని కౌశిక్ రెడ్డి నిలదీశారు. గాంధీ అనుచరులు దాడి చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. సీఐ, ఏసీపీ, ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
మరోవైపు.. తనకు రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించారు ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ. మీ ఇంటికొస్తా ఇంటి మీద జెండా ఎగరేస్తా అంటే ఖాళీగా ఉన్నామా అన్నారు. బ్రోకర్ నా కొడుకులు నోరు పారేసుకుంటే చూస్తూ ఊరుకుంటామా అంటూ ఘాటుపదజాలం వాడారు. గెలిపించకుంటే చచ్చిపోతా అని భయపెట్టి ఎమ్మెల్యేగా గెలిచిన ఇలాంటి కోవర్టులకు తన గురించి మాట్లాడే అర్హత లేదన్నారు గాంధీ.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com