OU Students : ఓయూలో సౌకర్యాల కోసం రోడ్డెక్కిన విద్యార్థులు

ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థినులు రోడ్డెక్కారు. రాత్రి రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. తమకు అందాల్సిన కనీస సౌకర్యాలు అందడంలేదంటూ అధికారులపై మండిపడ్డారు. వేసవి కావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమాచారం తెలుసుకున్న సెంటినరీ హాస్టల్ డైరెక్టర్ కల్యాణ లక్ష్మి, సూపరింటెండెంట్ పద్మ అక్కడికి చేరుకొని విద్యార్థినులతో మాట్లాడారు. సమస్య పరిష్కరిస్తామని.. విద్యార్థినులు ధర్నా విరమించుకోవాలని సూచించారు.
యూనివర్శిటీలోని సెంటినరీ లేడీస్ హాస్టల్‌లో నీళ్లు రావడంలేదంటూ నిరసనకు దిగారు. గత మూడు రోజులుగా హాస్టల్‌లో ఇబ్బంది పడుతున్నామన్నారు. తమకు వడ్డిస్తున్న ఆహారంలో నాణ్యత లేదన్నారు. భోజనంలో పురుగులు, వెంట్రుకలు, చెత్త వస్తోందని ఆరోపించారు. ఈ విషయమై సంబంధిత అధికారులకు చెప్పినా ఎవరూ పట్టించుకోవడంలేదని వాపోయారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com