CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంలో భారీ ఊరట
ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కేసు విచారణను మధ్యప్రదేశ్ కు బదిలీ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నందున కేసు దర్యాప్తును మధ్యప్రదేశ్ కు బదిలీ చేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఇప్పటికే పలుసార్లు విచారణ జరిగింది. తాజాగా జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథ్ ధర్మాసనం విచారించింది.
కేవలం అనుమానంతోనే పిటిషన్ వేశారని, ఊహాజ నిత అంశాలతో కోర్టుల్లో కేసుల విచారణ జరపలేమని బెంచ్ అభిప్రాయ పడింది. ప్రస్తుత దశలో ఈ కేసులో తాము జోక్యం చేసుకోలేమని, భవిష్యత్ లో సీఎం జోక్యం చేసుకుంటే మళ్లీ కోర్టును ఆశ్రయించవచ్చని సూచిస్తూ జగదీశ్ రెడ్డి విజ్ఞప్తిని తోసి పుచ్చింది. అలాగే ఈ కేసులో సీఎం, హోంమంత్రి జోక్యం చేసుకోవద్దని ఆదేశాలిచ్చింది. ఈ కేసును విచారిస్తున్న ఏసీబీ నేరుగా ప్రస్తుత సీఎం, హోం మంత్రి, డీజీపీకి కేసు విషయాలు రిపోర్టు చేయవద్దని ఆదేశాలిచ్చింది.
విచారణ సందర్భంగా.. పిటిషనర్, ప్రతివాదుల వాదనలను తుది ఉత్తర్వుల్లోకి తీసుకున్న ధర్మాసనం.. ఇప్పటి వరకు ఉన్న ప్రాసి క్యూటర్ కేసు తదుపరి ట్రయల్ ను కొనసాగిస్తారని స్పష్టం చేస్తూ విచారణను ముగించింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com