Telangana Ooty : చుట్టూ ఎత్తైన కొండలు.. పచ్చని చెట్లు..తెలంగాణ ఊటీకి పోయేద్దామా?

Telangana Ooty : చుట్టూ ఎత్తైన కొండలు.. పచ్చని చెట్లు..తెలంగాణ ఊటీకి పోయేద్దామా?
X

చుట్టూ ఎత్తైన కొండలు.. పచ్చని చెట్లు.. మలుపులు తిరిగే ఘాట్‌ రోడ్డు, చూడగానే మైమరిపించే ప్రకృతి సౌందర్యం, ఆహ్లాదరకమైన వాతావరణం అనంతగిరి కొండల సొంతం. ప్రకృతి రమణీయతకు మారుపేరుగా చెప్పుకునే ఈ ప్రాంతం తెలంగాణ ఊటీగా గుర్తింపుపొందింది. ఇక్కడికి వచ్చే సందర్శకులకు ఈ సహజసిద్ధమైన కొండలు ఆధ్యాత్మికం, ఆహ్లాదంతో పాటు ఆరోగ్యాన్ని పంచుతున్నాయి. అనంతగిరి కొండల గురించి మరిన్ని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.

హైదరాబాద్‌కు 60 కి.మీ. దూరంలోని అనంతగిరికి వస్తే సహజసిద్ధ ప్రకృతి ఒడిలో సేదతీరవచ్చు. ఇక్కడి కోట్‌పల్లి ప్రాజెక్టులో బోటు షికారు చేయొచ్చు. ఇక్కడికొస్తే రోజంతా ఆహ్లాదంగా గడిపేందుకు ఎన్నో అవకాశాలున్నాయి. వికారాబాద్‌ నుంచి అనంతగిరికి వెళ్తుంటే రోడ్డు పొడవునా ఇరువైపులా పచ్చని చెట్లతో అలరారుతుంది. ప్రకృతి ఒడిలో సేద తీరాలనుకునేవాళ్లు ఇక్కడికి వస్తే శరీరం ఉత్తేజకరంగా మారుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ కొండల పైనుండి నీరు ఉస్మానాసాగర్, అనంతసాగర్‌కు ప్రవహిస్తాయి. ఇక్కడి అడవులు తెలంగాణ రాష్ట్రంలోనే దట్టమైనది కాగా.. హైదరాబాద్​ నుంచి ప్రవహిస్తున్న మూసీ నదికి అనంతగిరి కొండలే జన్మస్థానం.

పక్షుల కిలకిల రావాలు..కుందేళ్ల పరుగులు..నెమళ్ల సోయగాలు.. పచ్చని పంటపొలాలతో కోట్‌పల్లి ప్రాజెక్టు కళకళలాడుతుంది. అనంతగిరికి వస్తే కోట్‌పల్లి ప్రాజెక్టు చూసి తీరాల్సిందే. వికారాబాద్‌కు 24 కి.మీ. దూరంలో ధారూర్‌ అటవీ ప్రాంతంలో ఈ ప్రాజెక్టు ఉంది. బోట్‌లో షికారు చేసే అవకాశం ఉండటంతో అత్యధికులు ఇక్కడికి వస్తుంటారు. ప్రాజెక్టు పరిసర ప్రాంతాలు ఎంతో ఆహ్లాదాన్నిస్తాయి. నీటి అలలను ముద్దాడుతూ వచ్చే చల్లని గాలలు బరువెక్కిన శరీరాన్ని తేలికపరుస్తాయి. ఇక్కడికి వచ్చే పర్యాటకులు ప్రాజెక్టులో జలకాలడుతూ ఆనందంగా గడుపుతారు.

అనంతగిరికి వచ్చిన పర్యాటకులు బుగ్గ రామలింగేశ్వర ఆలయాన్ని దర్శించుకుంటుంటారు. త్రేతాయుగంలో రాముడు రావణ సంహారం తర్వాత ఈ ప్రాంతంలో శివలింగాన్ని ప్రతిష్ఠించారు. శివలింగాన్ని అభిషేకించేందుకు రాముడు బాణం వేసి పాతాళగంగను పైకి రప్పించాడని చెబుతారు. గంగ బుడగ రూపంలో రావడంతో బుగ్గరామలింగేశ్వరుడు అన్న పేరు వచ్చిందని చరిత్ర. ఆలయంలోని నంది నోట్లో నుంచి నిరంతరం నీటి ధార వస్తూనే ఉంటుంది. ఆ జలం ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పటికే అంతుపట్టని రహస్యంగానే ఉంది.

అంతేకాకుండా వికారాబాద్‌ను ఆనుకొని వేలాది ఎకరాల్లో విస్తరించిన అనంతగిరి అటవీ ప్రాంతంలో ఔషధ మొక్కలను గుర్తించిన అప్పటి నిజాం ఏడో నవాబు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ 1946లోనే క్షయ చికిత్సాలయం నిర్మించడం విశేషం. ఇక్కడికి సమీప పట్టణాలు, గ్రామాలతో పాటు కర్ణాటక రాష్ట్రం బీదర్, గుల్బర్గాకు చెందిన క్షయ పీడితులు వచ్చి చికిత్స పొందుతున్నారు. డెహ్రడూన్‌ నుంచి ఔషధ మొక్కలు తీసుకొచ్చి అనంతగిరిని నాటి ఔషధ ఝరిగా రూపొందించడానికి కృషి జరుగుతోంది. అటవీ ప్రాంతంలోని మైదానాలు, ఖాళీ ప్రదేశాల్లో ఔషధ మొక్కలు నాటారు. వాటికి నష్టం వాటిల్లకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు.

టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ నిర్మాతలు సైతం వికారాబాద్, అనంతగిరి కొండలను షూటింగ్‌లకు ఎంచుకుంటున్నారు. హైదరాబాద్‌కు దగ్గరగా ఉండటంతో సినీ ప్రముఖులు ఇక్కడి అందమైన లొకేషన్స్‌పై మక్కువ చూపుతున్నారు. తక్కువ ఖర్చుతో పాటు సహజత్వానికి వీలుండటమే ఇందుకు కారణం. దశాబ్దకాలంగా నిర్మితమైన సినిమాల్లో దాదాపు 60 శాతానికి పైగా ఇక్కడ షూటింగ్ చేసినవే కావడం విశేషం. మొదట్లో చిన్న సినిమాలకే పరిమితమైనా.. ఇప్పుడు టాప్ హీరోల షూటింగ్‌లు అనంతగిరి కొండల్లో జరుగుతున్నాయి.

Tags

Next Story