TG: ప్రభుత్వ బడుల్లో మార్పు తెస్తాం

TG: ప్రభుత్వ బడుల్లో మార్పు తెస్తాం
తెలంగాణను పునర్నిర్మిస్తామన్న రేవంత్‌రెడ్డి... విద్య, వ్యవసాయ రంగాలకు కమిషన్లు ఏర్పాటు చేస్తామని వెల్లడి

ప్రభుత్వ బడుల్లో మార్పులు తేవడం ద్వారా తెలంగాణను పునర్‌నిర్మించాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకుసాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో సెమీ రెసిడెన్సియల్‌ విధానం అమలుచేసే అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. త్వరలో విద్య, వ్యవసాయ రంగాలకు కమిషన్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పదోతరగతి పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు. వందేమాతరం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు.


కార్పొరేట్‌ ప్రైవేటు సంస్థలతో పోటీపడి సర్కారీ పాఠశాలల విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించడం ప్రభుత్వానికి గర్వకారణమన్నారు. ఇప్పుడు సర్వీసులో ఉన్న 90శాతం మంది IAS, IPSలు, చాలా రాష్ట్రాల CMలు, మంత్రులు, కేంద్రమంత్రులు కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివారని గుర్తుచేశారు. విద్యార్థులు లేరని టీచర్ల కేటాయింపు జరగక, ఉపాధ్యాయులు లేరని విద్యార్థులు రాక.. కొన్నేళ్లుగా సర్కారీ విద్య నిర్వీర్యమైందన్నారు. ఈ పరిస్థితిలో మార్చేందుకే.... DSC ద్వారా త్వరలోనే 11 వేల టీచర్‌ పోస్టులు భర్తీ చేస్తున్నామని తెలిపారు. విద్య, వ్యవసాయం ప్రాధాన్యాంశాలుగా ప్రభుత్వం ముందుకెళ్తోందని.... సీఎం స్పష్టం చేశారు. త్వరలోనే విద్యాకమిషన్‌ ఏర్పాటుచేసి కాలానుగుణంగా సిలబస్‌లో మార్పులు చేస్తామని తెలిపారు.

10 GPA వచ్చిన విద్యార్థుల అడ్మిషన్లపై తల్లిదండ్రుల నుంచి వస్తున్న విజ్ఞప్తులకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. మరోవైపు ఎన్నికల కోడ్‌ ముగియడంతో రైతు రుణమాఫీ అమలుపై సీఎం రేవంత్‌రెడ్డి దృష్టిసారించారు. ఈ మేరకు వ్యవసాయ, సహకారశాఖ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. రుణమాఫీ సహా ఇతర అంశాలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వర రావుతో కలిసి అధికారులతో చర్చించారు.

Tags

Read MoreRead Less
Next Story