TG : దేశానికి రోల్‌మోడల్‌గా తెలంగాణ అంగన్‌వాడీలు : రేవంత్ రెడ్డి

తెలంగాణ అంగన్‌వాడీలు దేశానికి రోల్‌మోడల్‌గా నిలిచేలా తీర్చిదిద్దాలని.. ఇందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అంగన్‌వాడీలకు వచ్చే పిల్లలకు పౌష్టికాహారం అందించడంతో పాటు అయిదేళ్ల వరకు వారికి పూర్వ ప్రాథమిక విద్యను అందించి నేరుగా ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లేలా చూడాలని సీఎం సూచించారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్ల సాధికారిత శాఖలపై తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. అంగన్‌వాడీలకు నూతన భవనాలు నిర్మించే విషయంలో అధునాతన సాంకేతికతను వినియోగించుకోవాలని, పిల్లల అవసరాలకు తగినట్లు కంటైనర్లతో డిజైన్ చేయించే అంశాన్ని అధ్యయనం చేయించాలని సీఎం పేర్కొన్నారు. సోలార్ ప్లేట్లు, బ్యాటరీ బ్యాకప్‌తో కంటైనర్ అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటు చేస్తే తక్కువ వ్యయం, ఎక్కువ సౌకర్యం ఉంటుందని సీఎం అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో ఉన్న కంటైనర్ కేంద్రాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సీఎం సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లోని ప్రతి పిల్లవానికి పౌష్టికాహారం అందించాలని.. ఇందుకు ఎన్జీవోల సేవలు వినియోగించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. బాలామృతం ప్లస్‌ను పెద్ద మొత్తంలో ఇచ్చేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలన్నారు. కర్ణాటకలో జొన్న రొట్టెలను వినియోగిస్తున్నారని, పౌష్టికాహార నిపుణులతో చర్చించి వాటిని మహిళా సంఘాలతో పిల్లలకు అందించే అంశంపైనా దృష్టిసారించాలని సీఎం తెలిపారు. అంగన్‌వాడీల్లో పౌష్టికాహారం అందజేత, అంగన్‌వాడీల పర్యవేక్షణ, నిర్వహణపై వంద రోజుల కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల సంక్షేమం విషయంలో అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లు కలిసే పని చేయాలని సీఎం అన్నారు. అనాథ పిల్లలకు పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశం కల్పిస్తున్నారని, అదే సమయంలో ఏటీసీల్లోనూ వాళ్లకు ప్రవేశాలు కల్పించాలని సీఎం అధికారులను ఆదేశించారు. మన పిల్లలను సింగపూర్‌లోని నైపుణ్య శిక్షణ కేంద్రాలకు పంపే ఒప్పందం చేసుకున్నామని, అక్కడకు పంపే వారిలో అనాథ పిల్లలకు చోటు కల్పించాలని సీఎం ఆదేశించారు. ఔటర్ రింగు రోడ్డు పరిధిలోని మురికివాడలు, వలస కార్మికులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోని పిల్లల కోసం మొబైల్ అంగన్‌వాడీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, నిర్దేశిత సమయంలో అక్కడి పిల్లలకు ఆయా వాహనాల ద్వారా పౌష్టికాహారం అందేలా చూడాలని సీఎం ఆదేశించారు. విశ్రాంత ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులు ఆయా పిల్లలకు బోధన చేసేందుకు ఆసక్తి చూపితే అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. తెలంగాణ ఫుడ్స్, విజయా డెయిరీ ఉత్పత్తులను అంగన్‌వాడీలకు అందేలా చూడాలని సీఎం అన్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com