TG Assembly : ఈనెల 30 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. కాళేశ్వరం నివేదికపై చర్చ..

TG Assembly : ఈనెల 30 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. కాళేశ్వరం నివేదికపై చర్చ..
X

తెలంగాణలో మరోసారి రాజకీయాలు హీటెక్కనున్నాయి. అసెంబ్లీ వేదికగా అధికార , ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరగనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఈ నెల 30 నుంచి దాదాపు ఐదు రోజుల పాటు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను నిర్వహించనుంది. కేవలం కాళేశ్వరం అంశంపైనే చర్చ జరగనుండటంతో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగే అవకాశం ఉంది.

కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై విచారణ జరపాలని కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన పీసీ ఘోష్ కమిషన్ ఇటీవలే ప్రభుత్వానికి తన నివేదికను సమర్పించింది. అయితే, ఈ నివేదికను కొట్టివేయాలని కోరుతూ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రి హరీశ్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం, మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోకుండా స్టే ఇవ్వాలన్న పిటిషనర్ల అభ్యర్థనను తోసిపుచ్చింది.

కాగా అసెంబ్లీలో నివేదికపై చర్చ జరిపిన తర్వాతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తరుపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కోర్టుకు స్పష్టం చేశారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, ఒకవేళ నివేదికను పబ్లిక్ డొమైన్‌లో ఉంచి ఉంటే వెంటనే తొలగించాలని ఆదేశించింది. పూర్తి వివరాలతో మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను ఐదు వారాలకు వాయిదా వేసింది. ఈ క్రమంలో మరో నాలుగు రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం... బీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టేందుకే అని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Tags

Next Story