Telangana BJP : పురపోరులో బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు టాస్క్..!

తెలంగాణ బీజేపీకి రాబోయే మున్సిపల్ ఎన్నికలు అతిపెద్ద పరీక్షగా మారాయి. ఫిబ్రవరిలోనే 117 మున్సిపాలిటీలు, 6 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ అధిష్టానం పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. ఈ ఎన్నికలను కేవలం స్థానిక సంస్థల ఎన్నికలుగానే కాకుండా, భవిష్యత్ అసెంబ్లీ ఎన్నికలకు సెమీ ఫైనల్‌లా బీజేపీ చూస్తోంది. ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలకు పార్టీ అధిష్టానం గట్టి టాస్క్ అప్పగించింది. తమ పరిధిలో ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో గెలుపు సాధించాల్సిందేనని చెప్పింది.ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో బీజేపీ విజయం సాధించకపోతే వారి రాజకీయ ఇమేజ్‌పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పుడు ఎక్కువ సీట్లు గెలిస్తే మాత్రం ఆయా నియోజకవర్గాల్లో పార్టీ బలపడుతుంది. కేడర్‌లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇది పెద్ద ప్లస్ అవుతుంది.
బీజేపీ నాయకత్వం కూడా ఈ ఎన్నికల ప్రాధాన్యతను గుర్తించింది. అందుకే అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి ప్రచారం వరకూ అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటోంది. ఒక్కో వార్డుకు పలువురు ఆశావహులు పోటీ పడుతుండటంతో టికెట్ల ఎంపిక పార్టీకి సవాల్‌గా మారుతోంది. ఇంకో వైపు కాంగ్రెస్ అధికారంలో ఉండటం, బీఆర్‌ఎస్ బలమైన ప్రతిపక్షంగా వ్యవహరించడం వల్ల బీజేపీపై ఒత్తిడి పెరుగుతోంది. పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి కొంత అనుకూలత ఉన్నా, అది సీట్ల రూపంలో ఎంతవరకు మారుతుందన్నది కీలకంగా మారింది. ముఖ్యంగా కార్పొరేషన్లలో విజయం సాధిస్తే పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా రాజకీయంగా బలమైన గ్రాఫ్ పెరుగుతుంది.
ఈ ఎన్నికల్లో గెలిచే సీట్లే రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీకి బలంగా నిలుస్తాయి. అదే సమయంలో ఓటమి ఎదురైతే పార్టీ వ్యూహాలపై ప్రశ్నలు తలెత్తే అవకాశం కూడా ఉంది. మొత్తానికి, తెలంగాణ బీజేపీకి మున్సిపల్ ఎన్నికలు కేవలం స్థానిక సంస్థల పోటీ కాదు… ఇది నాయకుల సామర్థ్యాన్ని పరీక్షించే అగ్నిపరీక్షలా మారిందని అంటున్నారు. ఈ పోరులో బీజేపీ ఎన్ని సీట్లు గెలుస్తుంది? ఎక్కడ బలం చూపుతుంది అనేది ఎంపీలు, ఎమ్మెల్యేల మధ్య పోటీని పెంచుతోంది. మరి ఎవరు ఎలాంటి సత్తా చాటుతారో చూడాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

