30 మంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారంటూ బాంబు పేల్చిన బండి సంజయ్

రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసైను కలిశారు తెలంగాణ బీజేపీ నాయకులు. జీహెచ్ఎంసీ ఎన్నికలు పూర్తై నెల రోజులు గడిచాయని.. రాజ్యాంగం ప్రకారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. కానీ టీఆర్ఎస్ సర్కారు, ఎస్ఈసీ నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. కేసీఆర్, ఓవైసీ తీసుకున్న నిర్ణయాలనే.. ఎస్ఈసీ అమలు చేస్తోందని ఆరోపించారు. ఏ ధైర్యంతో ఎన్నికలు జరిపారో.. అదే ధైర్యంతో కొత్త పాలక మండలిని ఎన్నుకునే ప్రక్రియను మొదలుపెట్టాలన్నారు. ఇదే విషయమై గవర్నర్‌కు ఫిర్యాదు చేశామన్నారు బండి సంజయ్.
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో MIM సహకారం వల్లే TRSకి ఆమాత్రం సీట్లయినా వచ్చాయని బండి సంజయ్ అన్నారు. 30 మంది గులాబీ పార్టీ MLAలు తమతో టచ్‌లో ఉన్నారన్నారు. అయితే తాము ప్రజాస్వామ్య పద్ధతులకు విరుద్దంగా వెళ్లబోమని స్పష్టం చేశారు. అందుకే వారిని పార్టీలోకి తీసుకోవడం లేదనన్నారు. మా లైన్ క్లియర్‌గా ఉందని, ప్రజల ఆశీర్వాదంతో, అందరి సహకారంతో తప్పకుండా 2023లో అధికారంలోకి వస్తామన్నారు. టీఆర్ఎస్ సర్కారును ప్రజలు ఓడించబోతున్నారన్నారు. తమకు ఏ పార్టీతోనూ పొత్తు లేనేలేదని ప్రకటించారు.
జర్నలిస్టుల సమస్యలపైనా బీజేపీ పోరాటం చేస్తుందన్నారు బండి సంజయ్. అన్ని ఉద్యోగ సంఘాలను సీఎం మోసం చేస్తున్నారన్నారు. నిన్న ఉపాధ్యాయులను సమావేశానికి ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. ఏ ఒక్క యూనివర్సిటీలో వీసీలు లేరన్నారు. తెలంగాణలో ఏ రంగం వారు సంతోషంగా లేరన్నారు బండి సంజయ్. నిరుద్యోగ భృతి వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇక త్వరలో తెలంగాణలో బస్సు యాత్ర చేపడతామన్నారు బండి సంజయ్. 20 రోజుల పాటు 50 నియోజకవర్గాల మీదుగా యాత్ర ఉంటుందన్నారు. ఈ ఏడాది మధ్యలో పాదయాత్ర ప్రారంభిస్తానని పేర్కొన్నారు బండి సంజయ్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com